తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఆవిర్భావం అయితే చేశారు కానీ ఆ పార్టీకి దేశ స్థాయిలో హైప్ ఇచ్చేందుకు మాత్రం ప్రయత్నించడం లేదు. గతంలో ఢిల్లీలో బహిరంగసభ పెడతారని..పార్టీ గురించి విధి విధానాల గురించి ప్రకటిస్తారని చెప్పుకున్నారు. తర్వాత ప్రెస్ మీట్ పెడతారని చెప్పుకున్నారు. అలాంటిది కూడా ఏమీ జరగలేదు. ఇప్పుడు… కేసీఆర్ జిల్లాల పర్యటనల్లో భాగంగానే ఖమ్మంలో నిర్వహించబోయే బహిరంగసభనే బీఆర్ఎస్ ఆవిర్భావ సభగా ప్రకటించేశారు.,
ఈ నెల 18న బుధవారం ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగసభ నిర్వహించనున్నది. బీఆర్ఎస్గా మారిన తర్వాత పార్టీ నిర్వహిస్తున్న తొలి సభ ఇది. ఆవిర్భావ సభ అయినందున ఇతర రాష్ట్రాలకు చెందిన ముగ్గురు ముఖ్యమంత్రుల్ని ఆహ్వానించారు. ఇద్దరు ఆప్ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్ , భగవంత్‌మాన్ , మరో లెఫ్ట్ పార్టీ సీఎం విజయన్ ను ఆహ్వానించారు. యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కూడా వచ్చే చాన్స్ ఉంది.
తెలంగాణ ఉద్యమానికి, టీఆర్ఎస్ పార్టీకి బలమైన అండగా నిలిచిన బహిరంగ సభల మాదిరిగానే బీఆర్ఎస్ కూడా బహిరంగ సభ ద్వారానే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ సభ ద్వారా దేశ రైతాంగానికి, రాజకీయ పక్షాలకు స్పష్టమైన సందేశం ఇస్తామని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే జాతీయ పార్టీ సభను తెలంగాణలో పెట్టి… ప్రచారం చేసుకుంటే ఎవరు పట్టించుకుంటారన్న వాదన ఉంది. తెలంగాణలో ఎంత భారీ సభ పెట్టినా అతి తెలంగాణకు పరిమితమవుతుందని… అదే ఢిల్లీలోనే యూపీలోనో పెడితేనే జాతీయ పార్టీగా గుర్తింపు ఉంటుందని అంటున్నారు.
బీఆర్ఎస్ పార్టీ ప్రకటన తర్వాత చాలా కొద్ది మంది మాత్రమే కేసీఆర్‌కు సంఘిభావం తెలిపారు. చాలా పార్టీలు పెద్దగా పట్టించుకోవడం లేదు. పంజాబ్ ఎన్నికలకు కేసీఆర్ ఆర్థిక సాయం చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆప్ నేతలు ఎక్కువగా బీఆర్ఎస్కు మద్దతు పలుకుతున్నారు. ఇక కుమారస్వామి ఎప్పటి నుండో కేసీఆర్ వెంట ఉన్నారు. ఇతరుల నుంచి పెద్ద స్పందన రావడం లేదు.