రాజకీయాల్లోకి వచ్చాక కొన్ని సార్లు కాదు.. చాలా సార్లు తమ వ్యక్తిత్వాలను నేతలు చంపుకోవాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితే ఆర్ఎస్ ప్రవీణ్ కు ఎదురు అయింది. ఐపీఎస్ ఆఫీసర్‌గా ఉండి .. వీఆర్ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చిన ఆయన .. బీఎస్పీ చీఫ్ గా ఉన్నప్పుడు… తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అందులో చాలా వివరాలు ఉన్నాయి. కానీ అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు.
కానీ ప్రభుత్వం మారిన తర్వాత జరుగుతున్న పరిణామాలతో ఆయన ఫిర్యాదు వెలుగులోకి వచ్చింది. ఆయన నెంబర్ కూడా మావోయిస్టుల పేరుతో ట్యాపింగ్ చేసిన జాబితాలో ఉండటంతో పోలీసులు వాంగ్మూలం కోసం నోటీసులు పంపించారు. చాలా సార్లు ఎగ్గొట్టిన తర్వాత చివరికి హాజరయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. బిఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయాలని కుట్రలో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ కేసును తెర మీదికి తెచ్చారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కు మరియు బిఆర్ఎస్ కు ఎలాంటి సంబంధం లేదని ..కేసిఆర్ ప్రజలను నమ్ముకొని,ఆయన చేసిన మంచి పనులు నమ్ముకొని పని చేశారు కానీ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడలేదని సర్టిఫికెట్ ఇచ్చేశారు.
సిట్ విచారణలో భాగంగా అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పానని.. చట్టాన్ని గౌరవించి సిట్ విచారణకు హాజరయ్యానని చెప్పుకొచ్చారు. అప్పట్లో బీఆర్ఎస్ లో లేడు కాబట్టి ఫిర్యాదు చేశారు.. ఇవాళ ఆయన బీఆర్ఎస్ లో చేరాడు కాబట్టి ట్యాపింగ్ జరగలేదని చెప్పి తీరాలి. లేకపోతే ఇప్పుడు ఉన్న పార్టీలో పుట్టగతులు ఉండవు. ఆర్ఎస్ ప్రవీణ్ కు ఇంత కంటే దారి లేదు. ఆయన మాజీ పోలీసు అధికారి కాబట్టి ఆయన నిస్సహాయతను బీఆర్ఎస్ బాగా ఉపయోగించుకుంటోంది. రేవంత్ రెడ్డిపై రివర్స్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారు. అప్పట్లో చేసిన ట్యాపింగ్ ఆరోపణలను ఇప్పుడు ఖండించిన ఆర్ఎస్ ప్రవీణ్‌కు.. ఇప్పుడు చేసే ఆరోపణలకు విలువ ఉండదని ఎందుకు అర్థం చేసుకోలేకపోయారో మరి ?