కాంగ్రెస్ పార్టీ జూబ్లిహిల్స్ లో రౌడీషీటర్ ను బరిలోకి దింపిందని.. ఇది హైదరాబాద్లోని చదువుకున్న, శాంతిప్రియ పౌరులకు ఇది అవమానమని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజలు ఖచ్చితంగా తిరస్కరిస్తారని మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను ఎమ్మెల్యేగా గెలిపించేందుకు ఇప్పటికే ప్రజలు నిర్ణయించేసుకున్నారన్నారు. పార్టీ ముఖ్య నేతలతో పాటు జూబ్లిహిల్స్ క్యాడర్ ను ఫామ్ హౌస్కు పిలిపించుకున్న కేసీఆర్.. ప్రచారం ఎలా జరగాలన్నదానిపై దిశానిర్దేశం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అవినీతి, మోసంతో రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పార్టీ నేతలు ప్రతి ఇంటిని టచ్ చేయాలని.. బాకీ కార్డు ప్రతి ఇంటికి చేరేలా చూడాలన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితి, అభివృద్ధి ఆగిపోవడం గురించి ప్రజలకు వివరించాలన్నారు. హైదరాబాద్ గౌరవం కాపాడాలని.. రౌడీషీటర్ రాజకీయాలను తిరస్కరించాలని ఓటర్లకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నప్పటికీ ఆయన ప్రచారం చేసే అవకాశాలు లేవు. అందుకే పార్టీ నేతలందర్నీ పిలిపించి అందరికీ దిశానిర్దేశం చేసి పంపారు. తెర వెనుక రోజూ తాను ప్రచార సరళిని పర్యవేక్షిస్తానని ఆయన పార్టీ నేతలకు చెప్పారు. కేటీఆర్, హరీష్ రావులు క్షేత్ర స్థాయిలో పని చేయాలని .. అభ్యర్థికి అనుభవం లేనందున మొత్తం వ్యవహారాలు వారే చూసుకోవాలని కేసీఆర్ సూచనలు ఇచ్చారు.