హైదరాబాద్: చీప్ లిక్కర్‌ను ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనపై ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, మహిళాసంఘాలు, కల్లుగీత కార్మికులనుంచి ముప్పేటదాడి ఎదురవటంతో కేసీఆర్ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. చీప్ లిక్కర్‌ను ప్రవేశపెట్టే ప్రసక్తే లేదని మంత్రి పద్మారావు ఇవాళ చెప్పారు. గుడుంబా మహమ్మారినుంచి రక్షించాలనే చీప్ లిక్కర్‌ను ప్రవేశపెట్టాలని అనుకున్నామని తెలిపారు. చీప్ లిక్కర్‌పై ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతమని అన్నారు. గుడుంబా నియంత్రణకు ఒక తేదీ ప్రకటిస్తామని చెప్పారు. ఆ తర్వాత గుడుంబా కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. గౌడకులస్తులు చీప్ లిక్కర్ వలన నష్టపోతారన్న విపక్షాల వాదన సరైనది కాదన్నారు. ఉద్యమాలు చేసేవాళ్ళు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. గుడుంబాను అరికట్టాలన్నదే కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. గుడుంబావల్ల ఎంతోమంది చనిపోతున్నారని అన్నారు. కిరాణా దుకాణాల్లో మద్యం అమ్మే స్థాయికి దిగలేదని పద్మారావు చెప్పారు. ఒక కేసు చీప్ లిక్కర్‌పై ప్రభుత్వానికి రు.1,800 ట్యాక్స్ వస్తుందని, దానిని రు.700కు తగ్గించుకుని నాణ్యమైన లిక్కర్‌ను అందించటమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రజల ఆయుష్షును పెంచటానికే సీఎమ్ నూతన ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చారని చెప్పారు. చీప్ లిక్కర్‌ను కొత్తగా తయారుచేయటంలేదన్నారు. చీప్ లిక్కర్ ఎంత ఎక్కువ అమ్ముడైతే ప్రభుత్వానికి అంత నష్టమని చెప్పారు. ఎలాంటి నిర్ణయాలూ తీసుకోకముందే ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు ఎందుకని ప్రశ్నించారు.