✍ ఆర్థిక బలం ఉన్న రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పరిగెత్తించాల్సి ఉన్నా… పరిపాలన మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధిని కాంక్షిస్తున్నారు. సంపద పెంచాలని, పంచాలని అభిలాశిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏ ఒక్క వర్గం ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసే పరిస్థితి రానివ్వనని హామీ ఇచ్చినా, పాలనలో రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టకుండా ఏ ఒక్క వర్గమైనా ఉన్నదా?
? అవధులు లేని హామీలతో ప్రజలను నిరంతరం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారే తప్ప నిర్మాణాత్మకమైన చర్యలు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం చేపట్టడం లేదు. అందుకే మొదట్లో కేసీఆర్ ఆదర్శాలు, ప్రకటనలు, చిత్తశుద్ధిపై శ్రద్ద చూపిన వారు సైతం నేడు పునరాలోచనలో ఉన్నారు. ప్రణాళికలు, పథకాలు, ప్రకటనలు, నిధులు, వ్యూహాలు కాగితాలపైనే కొలువుతీరుతున్నాయి తప్ప కార్యాచరణకు నోచుకోవడం లేదు. హామీల అమలులో వైఫల్యాలను కప్పిపుచ్చు కోవడానికి ఆకాశ హార్మ్యాలు, ఎత్తైన టవర్లు, మల్టీలెవల్ ఫ్లై ఓవర్ల వంటి వాగ్దానాల వరదను పారిస్తూ బంగారు తెలంగాణ భ్రమల్లో ప్రజలను ఉంచుతున్నారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచుతున్నారు.
గ్రామీణ ప్రాంతాలకు ప్రాణధారమైన వ్యవసాయం ఇప్పుడు గాలిలో దీపం అయింది. రైతు జీవితం దారం తెగిన గాలిపటం అయింది. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలను వ్యవసాయ సంక్షోభానికి సూచికగా ప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదు.
? నేషనల్ క్రైమ్ బ్యూరో నివేదిక ప్రకారం రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రాష్ట్రానిది దేశంలోనే రెండో స్థానం. రెండేండ్లలో దాదాపు మూడువేల రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వచ్చింది. ఈ సంక్లిష్ట వ్యవసాయ సంక్షోభం నుంచి బయట పడడానికీ, రైతుల ఆత్మహత్యల నివారణకు ఈ ప్రభుత్వం కృషి చేయకపోగా, ఈ సమస్య మాది కాదు అన్నట్లుగా వ్యవహరించడం బాధాకరం.
? టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నీటి పారుదల విషయంలో ప్రజలను మభ్యపెట్టడం నిత్యకృత్యం అయింది. అంకెలు, సంఖ్యలతో ప్రజలను మోసం చేసే ప్రసంగాలు చేస్తున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో వాస్తవాలు వేరే విధంగా ఉంటున్నాయి. టీఆర్ఎస్ పార్టీ ముద్ర ఉండాలనే ఉద్దేశంతో తొలి అంచనాలను విచ్చలవిడిగా రెట్టింపు చేసారు. గత బడ్జెట్ల్లో నీటి ప్రాజెక్టుల కోసం 25 వేల కోట్ల రూపాయలను కేటాయించినా ఇప్పటి వరకు ఖర్చు 10వేల కోట్ల రూపాయలు కూడా దాటలేదు. ఈ మధ్య ప్రారంభించిన భక్త రామదాసు ప్రాజెక్టుకు రూ.90 కోట్లు ఖర్చుచేసి రూ.30 కోట్లు ప్రచారానికే వృధాచేశారు. ఈ ప్రాజెక్టుకు ఇందిరా సాగర్ ప్రాజెక్టులోని మోటర్లనే ఉపయోగించారు.
? ముఖ్యమంత్రి మొదటి ప్రసంగంలో అన్ని ప్రాజెక్టులను ఏడాది తిరగకముందే పూర్తి చేస్తామనీ, పెండింగ్ అనే పదమే ఉండదనీ అన్నారు. కానీ దాదాపు మూడేండ్లు కావస్తున్నా ఏ ఒక్క ప్రాజెక్టును నిర్ధిష్టంగా పూర్తి చేసిన పాపాన పోలేదు. నీళ్ళకు సంబంధించి ముఖ్యమంత్రి కోటి ఎకరాలకు నీళ్ళందిస్తానని పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో ద్వారా నీళ్ళను పారించి త్రీడీలో సినిమా చూపించారు. కోటి ఎకరాలకు నీళ్ళు అందించాలనే సంకల్పం స్వాగతించదగినదే అయినా నీళ్ళందిచడానికి కోటి ఎకరాల సాగుకు భూమి తెలంగాణ రాష్ట్రంలోనే లేదని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. ప్రభుత్వ అధికారిక (సోషియో ఎకనామిక్స్ సర్వే 2016) లెక్కల ప్రకారం తెలంగాణలో సాగుకు యోగ్యమైన భూమి 6757472 హెక్టార్లు మాత్రమే. కోటి ఎకరాలకు నీళ్లు ఏరకంగా ఇస్తారు. నిర్మాణంలోని ప్రాజెక్టులను ప్రాధాన్యతాక్రమంలో కేటాయింపులు జరిపి పూర్తి చేస్తే లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశాలు ఉన్నా, ప్రాజెక్టుల నిర్మాణం కన్నా పంతాలు, పట్టింపులకే కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం యొక్క భౌగోళిక విస్తీర్ణం 11207810 హెక్టార్లు ఉండగా, అందులో వ్యవసాయానికి అనుకూలమైన భూమి 6757472 హెక్టార్లు. మిగిలిన భూమి అటవీ ప్రాంతంగాను, నివాస ప్రాంతంగాను ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాక ముందు (2013-14) తెలంగాణ జిల్లాల్లో 4923003 హెక్టార్లు సాగులో ఉండగా 2015-16కు 4174532 లక్షల హెక్టార్లే సాగైందని ప్రభుత్వ నివేదికలే స్పష్టంగా చెబుతున్నాయి. సాగు ఎందుకు తగ్గింది? టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత 2750 రైతు ఆత్మహత్యలు జరిగితే 340 మాత్రమే జరిగినట్లు మాట్లాడిన సర్కారు తీరా పరిహారం ఇచ్చింది కేవలం 40 మందికి మాత్రమే. అసలు రైతుల బతుకులపై ప్రభుత్వ వైఖరి ఏమిటి? రాష్ట్రం నుండి సాయం కోరుతూ ఒక్క కాగితం ముక్కకూడా రాలేదని కేంద్ర మంత్రి రాధామోహన్‌సింగ్ కుండబద్దలు కొట్టారు. దీనిని బట్టే ఈ ప్రభుత్వానికి వ్యవసాయంపట్ల, రైతులపట్ల ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతున్నది.
Mahesh Beeravelly
Senior Journalist