పెద్దన్నగా జగన్ బాధ్యతలూ పంచుకుంటున్న కేసీఆర్..!

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ సీఎం కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి పెద్దన్న అనే విషయంలో… వైసీపీ నేతలకు క్లారిటీ ఉంది. సందర్భం వచ్చినప్పుడల్లా.. వైసీపీ మంత్రులు అదే చెబుతూంటారు. కానీ.. టీఆర్ఎస్ నేతలు ఎవరూ.. ఇంత వరకూ అలాంటి ప్రస్తావన చేయలేదు. తొలి సారి… తెలంగాణ సీఎం కేసీఆర్.. తాను జగన్మోహన్ రెడ్డికి పెద్దన్న అని ప్రకటించేశారు. కంచిలో అత్తి వరదర్‌ ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళ్లిన కేసీఆర్ .. తిరుగు ప్రయాణంలో.. రోజా ఇంట ఆతిధ్యం స్వీకరించి మీడియాతో మాట్లాడారు. రాయలసీమను రత్నాల సీమగా మారుస్తానని హామీ ఇచ్చారు. జగన్‌కు పెద్దన్నగా అండగా ఉంటానన్నారు.

సీమను రతనాలసీమగా చేస్తానన్న కేసీఆర్..!

గోదావరి జలాలను కేసీఆర్.. ఆంధ్రకు ఇస్తున్నారంటూ… జగన్ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. అసెంబ్లీలోనూ అవే వ్యాఖ్యలు చేశారు. అయితే.. గోదావరి నికరజలాలపై సంపూర్ణ హక్కులు ఏపీకి ఉన్నాయని.. తెలంగాణకు వాటా ఇవ్వడం ఏమిటన్న ప్రశ్న అన్ని చోట్లా నుంచి వస్తోంది. తెలంగాణ భూభాగంలో కట్టే ప్రాజెక్టుకు ఏపీ వేల కోట్లు పెట్టి… వారికి నీళ్లివ్వడం ఏమిటన్న చర్చ కూడా వస్తోంది. వీటన్నింటిని ఏపీ ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదు. ఎగువ నుంచి వస్తున్నాయి కాబట్టి.. కేసీఆర్ ఇస్తున్నారని జగన్ అంటున్నారు. ఇప్పుడు.. కేసీఆర్ కూడా.. అదే చెబుతున్నారు. ఎంత కష్టమైనా.. రాయలసీమకు నీళ్లిస్తానని ప్రకటించారు.

ఉమ్మడి రాష్ట్ర సీఎం అన్న అధికారుల మాటలను నిజం చేస్తున్నారా..?

కేసీఆర్ కు.. నగరి ఎమ్మెల్యే రోజా.. ఘన స్వాగతం పలికి.. అతిధి మర్యాదలు చేశారు. ఆలయానికి వెళ్లేటప్పుడే రోజా ఇంట్లో కేసీఆర్ ఆతిధ్యం స్వీకరించాల్సి ఉంది కానీ… సమయం కుదరకపోవడంతో.. వచ్చేటప్పుడు.. నగరి ఇంటి వద్ద ఆగారు. కేసీఆర్‌కు రోజా.. పూలబాట వేశారు. గులాబీ రేకులపై నడిపించారు. ఈ ఆతిధ్యానికి కేసీఆర్ కూడా.. ముగ్దుడైపోయారు. అందుకే.. రాయలసీమను రత్నాల సీమగా మారుస్తానని హామీ ఇచ్చారు. జగన్‌తో కలిసి కొత్త చరిత్ర సృష్టిస్తామని ప్రకటించారు. కేసీఆర్ టూర్‌కు అధికారులు.. కూడా అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. గతంలో… హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో జరిగిన సమావేశంలో.. కొంత మంది అధికారులు.. రెండు తెలుగు రాష్ట్రాలకూ కేసీఆరే సీఎం అన్నట్లుగా జగన్ సమక్షంలోనే మాట్లాడారు. ఇప్పుడు రాయలసీమ బాధ్యత కూడా.. కేసీఆరే తీసుకుంటున్నట్లుగా ఉంది.

బాధ్యతల్లో వాటానేనా..? ఉమ్మడి సంస్థల్లో వాటాలు తేల్చరా..?

నిజానికి ఏపీకి జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత… ఏపీ నుంచి తెలంగాణకు.. చాలా గుడ్‌న్యూస్‌లు అందాయి. సెక్రటేరియట్ భవనాలను అప్పగించేయడంతో.. వాటిని కూలగొట్టి.. కేసీఆర్ .. కొత్త సచివాలయ భవనాలను నిర్మించుకునే పనిలో ఉన్నారు. ఆ తర్వాత తెలంగాణలో కట్టిన ప్రాజెక్టులకు.. ఏపీ వైపు నుంచి అభ్యంతరాలు లేకుండా పోయాయి. కానీ… ఏపీకి మాత్రం.., ఇప్పటి వరకూ.. ఒక్క మంచి వార్త కూడా తెలంగాణ నుంచి రాలేదు. ఉమ్మడి సంస్థల ఆస్తులను విభజిస్తారేమోనని.. కరెంట్ బకాయిలు చెల్లిస్తారేమోనని.. చాలా మంది అనుకున్నారు. కానీ.. అటు తెలంగాణ సర్కార్ కానీ.. ఇటు.. ఏపీ సర్కార్ కానీ వాటి గురించి మాట్లాడటం లేదు. తెలంగాణ సీఎం మాత్రం.. జగన్ బాధ్యతల్లో వాటా తీసుకునేందుకు సై అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com