ఉన్న‌ది ఉన్న‌ట్టే మాట్లాడాను అంటున్న కేసీఆర్‌..!

KCR
KCR
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని అగౌర‌వప‌ర‌చే విధంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట్లాడారంటూ భాజ‌పా నేత‌లు మండిప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. వెంట‌నే క్ష‌మాప‌ణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. నిజానికి, ఇదే అంశ‌మై గ‌డ‌చిన మూడు రోజులుగా చ‌ర్చ జ‌రుగుతోంది. కేంద్ర‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కొంత ఆగ్ర‌హం వ్య‌క్తం చేసినట్టు కథనాలు వచ్చాయి. ఆ త‌రువాత‌, ఎంపీ క‌విత కొంత వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. అయితే, ఆ అంశంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా చివరికి స్పందించారు. మోడీని అగౌరప‌ర‌చానంటూ వ‌స్తున్న క‌థ‌నాల‌ను ఆయ‌న ఖండించారు. త‌న ప్ర‌సంగం వీడియో క్లిప్పులు తెప్పించుకుని చూశాన‌న్నారు. పొర‌పాటున నోరు జారానేమోన‌ని చూసుకున్నాన‌ని అన్నారు. కానీ, అలాంటి సంద‌ర్భం ఎక్క‌డా లేద‌న్నారు.
అవిభ‌క్త ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల గురించి మాట్లాడుతున్న సంద‌ర్భంలో వాడూ వీడూ అన్నాన‌ని అన్నారు. ఇక్కడి ప్ర‌జ‌ల‌కు వాడుక భాష‌లో మాట్లాడితేనే అర్థ‌మౌతుంద‌నీ, అందుకే తాను అలానే మాట్లాడేందుకు ఇష్ట‌ప‌డ‌తాన‌ని కేసీఆర్ చెప్పారు. ఉన్న‌ది ఉన్న‌ట్టుగా కేసీఆర్ మాట్లాడితే అలానే ఉంటుంద‌న్నారు. ప్ర‌ధాన‌మంత్రిని తాను తూల‌నాడాను అనడం శుద్ధ త‌ప్పు అన్నారు. మోడీ ‘గారికి’ అని తాను చాలా స్ప‌ష్టంగా మాట్లాడాన‌నీ, కానీ ‘గాడికి’ అన్నాన‌ని వాళ్లు చెప్తున్నార‌న్నారు. అది వాళ్ల ఖ‌ర్మ అనీ, ప్ర‌ధాన‌మంత్రిని తామే కించ‌ప‌రుచుకుంటామంటే చేసేదేం లేద‌న్నారు.
భాజ‌పా నాయ‌కులు కొంచెం ఒళ్లు ద‌గ్గ‌ర‌పెట్టుకుని మాట్లాడాల‌న్నారు. ఒక భాజ‌పా ఎమ్మెల్యే మాట్లాడుతూ… కేసీఆర్ కి జైలుకు పోవాల‌నుందా, ప్ర‌ధాన‌మంత్రినే విమ‌ర్శిస్త‌డా అంటున్నార‌న్నారు. ప్రధానిని విమర్శించకూడదనే రూలేమన్నా ఉందా, దేశంలో మాట్లాడినోళ్లంద‌రినీ జైలుకు పంపిస్తారా, ఇదెక్క‌డి రాజ‌కీయ‌మో అర్థం కావ‌డం లేద‌న్నారు. ఎవ్వ‌ర్నైనా ఏదైనా చేయ‌గ‌లమని అన్ని సంద‌ర్భాల్లో అనుకుంటే క‌ష్ట‌మ‌నీ, కొన్ని సంద‌ర్భాల్లో కొంద‌ర్ని ముట్టుకుంటే భ‌స్మ‌మౌతార‌ని ప‌రోక్షంగా హెచ్చ‌రించారు. భాజ‌పా గురించి మాట్లాడుతూ… తెలంగాణ‌లో భాజ‌పా ఉన్న‌దా… జోకులు కాక‌పోతే అని న‌వ్వారు. తెరాస అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఉప ఎన్నిక‌ల్లోగానీ, జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లోగానీ భాజ‌పా ఎక్క‌డైనా క‌నిపించిందా అంటూ ఎద్దేవా చేశారు. ఇదే స‌మావేశంలో కాంగ్రెస్ నేత‌ల‌పై కూడా పంచ్ లు వేశారు. గ‌డ్డాలూ మీసాలు పెంచుకుంటే రాజ‌కీయం అవుతుందా అంటూ ఎద్దేవా చేశారు. బ‌స్సుయాత్ర ద్వారా త‌మ‌లో లోపాల‌ను ఎత్తి చూపితే స‌రిదిద్దుకుందామ‌ని చూస్తే… అందులో ప‌నికొచ్చేది ఒక్క పాయింట్ క‌నిపించ‌డం లేద‌న్నారు.
ఏదైతేనేం, గ‌డ‌చిన కొద్ది రోజులుగా జ‌రుగుతున్న ప్ర‌ధానిపై వ్యాఖ్య‌ల చ‌ర్చ‌కు ఫుల్ స్టాప్ పెట్టే ప్ర‌య‌త్నం చేశారు. తాను అలా అన‌లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. అయితే, మొన్న‌టికి మొన్న కేసీఆర్ కుమార్తె మాట్లాడుతూ.. రైతుల స‌మస్యల‌పై ఆవేద‌న‌తో మాట్లాడూ కేసీఆర్ నోరు జారి ఉంటారేమోన‌నీ, ఉద్దేశ‌పూర్వ‌కంగా అలా ఉండ‌ర‌ని ఆమె చెప్పారు. కొంద‌రు తెరాస నేత‌లు కూడా ఇలానే స‌మ‌ర్థింపుగా మాట్లాడారు. తాను వీడియో తెప్పించి చూసినా అందులో దోష‌మేమీ క‌నిపించ‌లేద‌ని ఇప్పుడు కేసీఆర్ అంటున్నారు. అంటే, కేసీఆర్ ప్ర‌సంగాన్ని వీరంతా విన‌లేదా..? లేదా, కేసీఆర్ చెబుతున్న‌ట్టుగా ‘రు’ అక్షరం ‘డు’గా వినిపించిన‌వాళ్ల‌లో వీళ్లూ ఉన్నారా..?
Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com