తెలంగాణ ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. వెళ్లారు. అసెంబ్లీ హాల్లో ఐదు నిమిషాలు ఉన్నారు. ఆ తర్వాత వెళ్లిపోయారు. మళ్లీ అసెంబ్లీకి వస్తారని బీఆర్ఎస్ నేతలు చెప్పడం లేదు. కేవలం హాజరు కోసమే ఆయన వచ్చారని తెలుస్తోంది. అనర్హతా వేటు పడకుండా ఉండేందుకు అసెంబ్లీ సమావేశాలు వచ్చినప్పుడు ఒక్క రోజు హాజరు వేయించుకుని వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది.
కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని భారీగా హైప్ వచ్చింది. కేసీఆర్ సమయం కంటే ముందుగానే అసెంబ్లీకి వచ్చారు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయానికి వెళ్లారు. రిజిస్టర్ లో సంతకం చేశారు. ఆ తర్వాత సమయం ఉన్నప్పటికీ ముందుగానే అసెంబ్లీ హార్ కు వెళ్లి తన సీటులో కూర్చున్నారు. అప్పటికే పెద్దగా సభ్యులెవరూ రాలేదు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ హాల్లోకి రాగానే కెసిఆర్ దగ్గరికి వెళ్లి కరచాలనం చేశారు. ఆరోగ్యం గురించి వాకబు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎలాంటి మొహమాటాలు లేకుండా పలకరించడంతో ఇతర ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా కేసీఆర్ వద్దకు వెళ్లి పలకరించి షేక్ హ్యాండ్ ఇచ్చారు. కొత్త ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కూడా కేసీఆర్ వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు. ఇలా వచ్చి పలకరింపులు సాగుతూండగానే.. కేసీఆర్ తన సీట్లో నుంచి లేచి వెళ్లిపోయారు. నందినగర్ నివాసానికి వెళ్లిపోయారు. ఆయనతో పాటు హరీష్ రావు కూడా వెళ్లిపోయారు.
ఇక వరుసగా అసెంబ్లీ సమావేశాలకు వస్తారని బీఆర్ఎస్ చెప్పడం లేదు.. అలాగని రారని కూడా చెప్పడం లేదు. కేసీఆర్ ఫామ్ హౌస్కు వెళ్లిపోతే .. జల వివాదాలపై చర్చలకు రానట్లేనని అనుకోవచ్చు.
