ఎడిటర్స్ కామెంట్ : టైమింగ్ మిస్సవుతున్న ముఖ్యమంత్రులు..!

రాజకీయాల్లో ఎవరూ ఓడిపోరు. ఎవరికి వారు ఓడించుకుంటారు. అలా ఎవరూ గెలవరు. అధికారంలో ఉన్న వారే ఎదుటివారిని గెలిపిస్తారు. పాలనపై చిరాకెత్తి… తమకు ప్రత్యామ్నాయంగా ఎవరున్నారో వారినే గెలిపించుకుంటారు. పాలపై చిరాకెత్తేలా చేసుకోవడమే పాలకుల తప్పిదం. స్వయంకృతం. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పుడు… అదే కోవలో పయనిస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఒక ప్రభుత్వం అర్థంపర్థం లేని ఈగోలతో ప్రజల్లో ఇదేం సర్కార్ అనే భావనకల్పిస్తూండగా.. మరో ప్రభుత్వం .. సందర్భోచితంగా లేకుండా నాయకత్వ మార్పును ప్రజలపైకి రుద్దుతోతంది. దీంతో ప్రజల్లో వచ్చే రియాక్షనేంటో అర్థం చేసుకోవడం సాధ్యం కావడం లేదు. ఆ రియాక్షన్ తేడాగా ఉంటే… ఆపరేషన్ సక్సెస్ – పేషంట్ డెడ్ అన్నట్లుగా మారిపోతుంది.

కేటీఆర్‌ పట్టాభిషేకానికి కేసీఆర్ ఏర్పాట్లు..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు పదవీ విరమణ మీద దృష్టి సారించారు. దుబ్బాక ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించి ఉన్నట్లయితే… ఆయన ఏం చేసేవారో కానీ.. ఇప్పుడు మాత్రం.. ఎంత వేగంగా తాను పదవి నుంచి దిగిపోయి…తన కుమారుడు కేటీఆర్‌ను సీఎం చేద్దామా అన్న ఆరాటంలో ఉన్నారు. అన్ని రకాల ప్రిపరేషన్స్ పూర్తి చేసి… ప్రజల్లోనూ ఇక ఖాయమే అన్న ఫీలింగ్ కల్పించడానికి కసరత్తు ప్రారంభించారు. పార్టీ నేతలతో ముందస్తు ప్రకటనలు చేయిస్తున్నారు. చివరికి కేటీఆర్ సమక్షంలోనే ప్రకటనలు ప్రారంభమయ్యాయి. కొద్ది రోజులు పోతే.. ఎమ్మెల్యేలు అందరూ తీర్మానాలు చేయవచ్చు. ప్రజల పేరుతో టీఆర్ఎస్ కార్యకర్తలు ర్యాలీలు చేయవచ్చు. చివరికి ఎమ్మెల్యేలు, ప్రజల ఒత్తిడికి తలొగ్గి కేసీఆర్.. కేటీఆర్‌ను సీఎం చేయడానికి అంగీకరించి.. ఆ మేరకు.. వారసుడిగా బ్యాటన్ అందించవచ్చు. అద్భుతాలు జరగకపోతే…. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే… సీక్వెన్స్ ఇలాగే ఉండొచ్చు.

ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైన ఈ సమయంలో రిస్కే..!

కానీ కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తీసుకున్న సమయం మాత్రం చాలా సున్నితమైనది. ఎందుకుంటే… తెలంగాణ సమాజంలో రాజకీయం భిన్నమైనది. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ. రాష్ట్ర ప్రజల ఆకాంక్షల కోసం పోరాడి అనుకున్నది సాధించిన పార్టీ. అంత మాత్రాన ప్రజలు ఆ పార్టీని ఎల్ల కాలం భుజాన మోయాలని లేదు. ముఖ్యంగాకేసీఆర్‌నే కాదు ఆ పార్టీ వారసుడ్నీ మోయాలని లేదు. వాస్తవానికి వారసుడు అనే సరికి ప్రజల్లో ఓ రకమైన నెగెటివ్ అభిప్రాయం ఏర్పడుతుంది. ఈ వారసుడ్ని తాము పీక్స్‌లో ఉన్నప్పుడే ప్రజల్లోకి దింపాలి. వాళ్ల ఆమోద ముద్ర వేయించాలి. కేటీఆర్ రాజకీయ రంగ ప్రవేశం.. ఎమ్మెల్యేగా ఆయనకు ఆమోదముద్ర లాంటి వాటిని కేసీఆర్ సమర్థంగానే డీల్ చేశారు. కానీ సీఎం పదవి అప్పగించే సమయానికి పరిస్థితులు మారిపోయాయి. టీఆర్ఎస్‌కు ఎదురుగాలి ప్రారంభమయింది. కేసీఆర్ పాలనపై వ్యతిరేకత ప్రారంభమైన ఈ సమయంలో నాయకత్వ మార్పు జరిగితే పరిణామాలను ఊహించడం కష్టం. అధినేత మాటను ఎమ్మెల్యేలు, మంత్రులు జవ దాటక పోవచ్చు కానీ.. ప్రజలు మాత్రం… పట్టించుకోరు. తాము ఓట్లేసింది కేసీఆర్‌కని..కేటీఆర్‌కు కాదన్న భావన వారిలో అంతకంతకూ పెరిగే ప్రమాదం ఉంది. ఎందుకంటే.. ప్రభుత్వ వ్యతిరేకత అనేది బలంగా ప్రారంభమయిందని ఇప్పటికే… ఎన్నికల ఫలితాల సాక్షిగా వెల్లడయింది.

వాయిదాలతో టైమింగ్ మిస్సయిన కేసీఆర్..!

కేటీఆర్ సీఎంగా సమర్థుడే. కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే… దేశంలో ఉన్న ఎంతో మంది ముఖ్యమంత్రుల కన్నా హైలీ క్వాలిఫైడ్. ఎలాగైనా తెలంగాణ ప్రజలకు మేలు చేయాలనుకునే తత్వం ఉంది. కానీ రాజకీయాలకు అది గీటు రాయి కాదు. అక్కడే సమస్య వస్తోంది. కేటీఆర్‌ సీఎం అనిదాదాపుగా నాలుగేళ్లుగా కేసీఆర్ ప్రచారం చేస్తున్నారు. నాలుగేళ్ల కిందట.. అట్ట హాసంగా మేడ్చల్‌లో ప్లీనరీ నిర్వహించినప్పుడే… కేటీఆర్‌కు పట్టాభిషేకం చేయబోతున్నట్లుగా మీడియాకు లీకులిచ్చారు. కానీ ఆ తర్వాత ఆ ప్రచారం అలా చేస్తూనే ఉన్నారు. చివరికి.. ముందస్తు ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన తర్వాత కూడా అదే ప్రచారం జరిగింది. కానీ కేసీఆర్ ఎందుకో ముందడుగు వేయలేకపోయారు. ఒక్కో ఎన్నిక జరుగుతున్న కొద్దీ ఇది గెలిచిన తర్వాత.. ఇది గెలిచిన తర్వాత అంటూ… వాయిదా వేసుకుంటూ పోయారు. ఇప్పుడు… ఆ గెలుపులు కనిపించకుండా పోయాయి. నిజంగా కేసీఆర్ మాటకు తిరుగే లేనప్పుడు…రెండో సారి గెలిచినప్పుడు కేటీఆర్‌కు పట్టంకట్టి ఉన్నట్లయితే.. ఈ పాటికి ప్రజలు అలవాటు పడిపోయి ఉండేవారు. కానీ ఇప్పుడు… సీన్ రివర్స్ అయింది.

తేడా వస్తే కవర్ చేయడం కేసీఆర్ వల్లా కాకపోవచ్చు..!

రాజకీయ వ్యూహాల్లో కేసీఆర్ ను మించిన వారు లేరు. అయితే అన్ని సార్లూ తాము అనుకున్నట్లే జరుగుతుందని ఎవరూ అనుకోలేరు. అన్నీ సక్సెస్ అయితే.. అసలు వారసుడ్ని పీఠం మీద కూర్చోబెట్టే ప్రయోగం రివర్స్ అయితే… ఇప్పటి వరకూ ఫలించిన ప్రయోగాలన్నీ వేస్టే . ఉద్యమంతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న ప్రజలు… వారసత్వ రాజకీయాలను పెద్దగా ఇష్టపడరు. అదే సమయంలో ఉద్యమాలతో పార్టీని ముందుకు తీసుకెళ్లిన నేతలకూ ఇష్టం ఉండదు. బలవంతంగా అంగీకరించినా.. వారికంటూ ఓ ఫ్లాట్ ఫామ్ దొరికితే… మొత్తానికే తేడా వస్తుంది. అదే సమయలో ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇచ్చిన దళితసీఎం వంటి హామీలు.. ఇలాంటి సమయంలో తెరపైకి వస్తాయి. వీటన్నింటినీ డీల్ చేయడం..కేసీఆర్‌ కు అంత తేలిక కాదు. అధికార బలంతో అన్నింటినీ కప్పి పుచ్చేసి… పనులు చేసేస్తే నిప్పుల మీద దుప్పటి కప్పినట్లే అవుతుంది. అది మరింత ప్రమాదకరం.

ఏం కోల్పోతున్నారో అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఏపీ సీఎం..!

ఇక ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి మరింత భిన్నం. కష్టపడి చెట్టుకొట్టి మీదేసుకునే బాపతు ఆయన. తాను అనుకున్నదే న్యాయం అని అనుకుంటారేమో కానీ.. న్యాయనిపుణుల సలహాలు కూడా పట్టించుకోకుండా… తాను చెప్పినట్లుగా చేయాలని హుకుం జారీ చేస్తారని తాజా పరిణామాలతోనే తేలిపోతోంది. స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టుకు వెళ్లడమే దీనికి నిదర్శనం. హైకోర్టు కొత్త చీఫ్ జస్టిస్ అరూప్ గోస్వామి, జస్టిస్ ప్రవీణ్ కుమార్ ధర్మాసనం ఇచ్చిన తీర్పులో స్పష్టంగా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఊటంకించారు. అంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఎవరూ సుప్రీంకోర్టుకు వెళ్లి చీవాట్లు తినాలని అనుకోరు. కానీ అయిననూ పోయిరావలెనని జగన్ పిటిషన్ వేయించారు. ఒక్క విషయంలో కాదు… ప్రతీ విషయంలోనూ అంతే. కొత్త వైద్యుడు కంటే… పాత రోగి మేలు అన్నట్లుగా … ఎన్నో కేసులతో ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగిన తనకు న్యాయపరంగా అన్నీ తెలుసని అనుకుంటున్నారేమో కానీ పూర్తిగా తన చర్యలతో చులకన అయిపోతున్నారు. పంచాయతీ ఎన్నికలు పెడితే స్వీప్ చేస్తామని చెబుతున్నారు. నిజానికి అడ్వాంటేజ్ వైసీపీకే ఉంటుంది. మరి అలాంటప్పుడు ఎన్నికలకు ఎందుకు వెనుకాడుతున్నారన్నదేసమస్య. నిమ్మగడ్డ ఎన్నికల ఏర్పాట్లు మాత్రమే చేయగలరు కానీ… ఫలితాల్ని నిర్దేశించలేరు… ఎన్నికలు నిర్వహించినా యంత్రాంగం అంతా ప్రభుత్వానిదే. అయినా ఎందుకు జగన్ భయపడుతున్నారో ఆయనకే తెలియదు. బహుశా అది భయం కూడా కాకపోవచ్చు… ఈగో ప్రాబ్లం అయి ఉంటుంది. రాజకీయాల్లో ఈగోలకు పోయి కనుమరుగు అయిన నేతలందర్నో చూశాం. ఎవరికీ ఎవరూ చెప్పలేరు. ఎవరికి వారు తెలుసుకోవాలి. అది చేతులు కాలక ముందే తెలుసుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోడీ ఆలోచిస్తారు..కేటీఆర్ పాటిస్తారు..! మరీ ఇంత ఫాస్టా..?

తెలంగాణలో " ఆజాదీ కా అమృత్ మహోత్సవ్" పేరిట వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల పన్నెండు నుంచే... ప్రారంభించాలని ఆదేశించారు. ఆగస్టు పదిహేను వరకు సాగుతాయి. ఉత్సవాలకు రూ.25...

వైసీపీపై రిపబ్లిక్ టీవీ ఆర్నాబ్‌కు కోపం ఎందుకు..!?

రిపబ్లిక్ టీవీ అంటే ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆర్నాబ్ గోస్వామి తన అరుపులతోనే ఓ బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఆయన నేతృత్వంలో నడుస్తున్న చానల్‌పై ఉన్న వివాదాలు అన్నీ...

అంతా రాజకీయమే..! స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునేదెలా..?

స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం తేల్చేసింది. రోడ్డెక్కి చేస్తున్న ఆందోళనలను.. అధికార ప్రతిపక్ష లేఖను కేంద్రం పట్టించుకోలేదు. చెత్తబుట్టలో వేసింది. ఎవరేం అనుకున్నా.. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను వంద శాతం అమ్మి తీరుతామని స్పష్టం...

సీబీఐ చేతికి నయీం కేసు..! రాజకీయ ప్రకంపనలు తప్పవా..!?

తెలంగాణలోకి సీబీఐకి ఎంట్రీ నయీం కేసు ద్వారా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నయీం కేసును సీబీఐకి ఇస్తారా అంటూ.. కేంద్ర హోంశాఖ నుంతి తెలంగాణ సర్కార్‌కు లేఖ వచ్చింది. సాధారణం రాష్ట్ర ప్రభుత్వం...

HOT NEWS

[X] Close
[X] Close