కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ నివేదికను ప్రవేశపెట్టేందుకు ఏర్పాటు చేస్తున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు కేసీఆర్ సిద్ధంగా లేరు. ఆరోగ్య కారణాలు, రాజకీయ కారణాలతో ఆయన అసెంబ్లీకి హాజరు కాకపోవడమే మంచిదని అనుకుంటున్నారు. అందుకే అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై కేటీఆర్, హరీష్ రావులకు దిశానిర్దేశం చేశారు. కేటీఆర్ నేతృత్వంలోనే రేవంత్ ప్రభుత్వాన్ని ప్రతిపక్షం ఎదుర్కోనుంది.
కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావడం లేదు. ఇప్పటికి రెండు రోజులు మాత్రమే హాజరయ్యారు. అది కూడా కేవలం హాజరు కోసమే అన్నట్లుగా హాజరయ్యారు. చర్చల్లో పాల్గొనలేదు. ఎక్కువ సేపు కూర్చోలేదు. అనర్హతా వేటు వేసే అవకాశాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా ఆయన అలా రెండు రోజులు వచ్చారని భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి స్థాయికి తాను అవసరం లేదని కేసీఆర్ భావిస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కానీ స్థాయి అనేది పదవుల్లోనే ఉంటుందని ఆయన ప్రతిపక్ష నేత అనే సంగతిని మర్చిపోతే ఎలా అని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఇతర అంశాల సంగతి ఎలా ఉన్నా.. కాళేశ్వరంపై చర్చకు మాత్రం కేసీఆర్ వస్తేనే మంచిదని బీఆర్ఎస్ వర్గాలు కూడా అనుకుంటున్నాయి. కాళేశ్వరం రిపోర్టు విషయంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఉంది. కేసీఆర్ తప్పు చేశారని నిరూపించే ప్రయత్నంలో ఉంది. చట్టపరంగా కన్నా.. ప్రజల్లో ఎక్కువ చర్చ జరగాలని అనుకుంటోంది . ఈ వ్యూహాన్ని తిప్పికొట్టాలంటే.. కేసీఆర్ వాయిసే సరైనదని బీఆర్ఎస్ అనుకుంటోంది. కానీ కేసీఆర్ ఈ అంశంపైన చర్చించేందుకైనా వస్తారా రారా అన్నది సందేహాస్పదంగా మారింది.