ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ప్రస్తుతం విచారణకు హాజరు కాకపోవడమే మంచిదని బీఆర్ఎస్ వ్యూహకర్తలు ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. కేసీఆర్ అభ్యంతరాలను పట్టించుకోకుండా సిట్ అధికారులు పట్టుబట్టి ఆదివారం మధ్యాహ్నం విచారణకు సిద్ధం కావాల్సిందేనని అదీ కూడా నందినగర్ నివాశంలోనేనని నోటీసులు జారీ చేసినందున న్యాయపోరాటం వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది.
సెక్షన్ 160 CrPC , నివాస స్థలం వివాదం
కేసీఆర్ తన 71 ఏళ్ల వయస్సును , సీఆర్పీసీ సెక్షన్ 160 లోని నిబంధనలను ప్రధానాధారంగా చేసుకుని సిట్‌కు బదులిచ్చారు. 65 ఏళ్లు పైబడిన వ్యక్తులను వారి నివాసంలోనే విచారించాలనే నిబంధనను సిట్ గుర్తించినప్పటికీ, నివాసం ఎక్కడనే దానిపై పేచీ మొదలైంది. సిట్ అధికారులు ఆయన హైదరాబాద్‌లోని నందినగర్ నివాసాన్ని ఎంచుకోవాలని కోరగా, కేసీఆర్ మాత్రం తన ఎర్రవెల్లి ఫాంహౌస్ లోనే విచారించాలంటున్నారు. చట్టప్రకారం అక్కడికే వచ్చి విచారించాలని స్పష్టం చేశారు. సిట్ తన పరిధిని కేవలం హైదరాబాద్ నగరానికే పరిమితం చేయడం చట్టవిరుద్ధమని ఆయన తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. కానీ సిట్ మాత్రం నంది నగర్‌నే ఫైనల్ చేసింది.
మున్సిపల్ ఎన్నికల తర్వాతే విచారణకు రెడీ
కేసీఆర్ సిట్ కు ఇచ్చిన రిప్లయ్ లో మున్సిపల్ ఎన్నికల తర్వాతనే విచారణ తేదీని ఖరారు చేయాలని కోరారు. కానీ సిట్ అధికారులు పట్టించుకోలేదు. రెండు రోజుల్లోనే తేదీని ఖరారు చేశారు. ఇది కూడా కేసీఆర్ న్యాయపోరాటానికి ఓ పాయింట్ గా మారనుంది. తనను సాక్షిగా పిలుస్తున్నందున.. ఒత్తిడి చేయలేరని..తన అనుమతి మేరకు జరగాలని ఆయనంటున్నారు. కేసీఆర్ లీగల్ టీమ్ కూడా అదే చెబుతోంది.
లంచ్ మోషన్ పిటిషన్ – న్యాయపోరాట వ్యూహం?
సిట్ నోటీసులు చట్టబద్ధంగా లేవని, నివాస స్థలం, సమయం విషయంలో అధికారులు మొండిగా వ్యవహరిస్తున్నారని భావిస్తున్న బీఆర్ఎస్ లీగల్ టీం ఇప్పటికే హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఆదివారం మధ్యాహ్నం విచారణ జరగాల్సి ఉన్నందున, అంతకంటే ముందే కోర్టు నుండి స్టే తెచ్చుకోవాలనేది కేసీఆర్ లీగల్ టీం వ్యూహంగా కనిపిస్తోంది. ఒక వ్యక్తిని విచారించే సమయం , స్థలం నిర్ణయించే హక్కు దర్యాప్తు సంస్థకే కాకుండా, సాక్ష్యం చెప్పే వ్యక్తికి కూడా చట్టం కల్పించిన వెసులుబాటును ఈ పిటిషన్లో ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంది.
ఇప్పటికే కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ రావులను విచారించిన సిట్.. ఇప్పుడు నేరుగా కేసీఆర్‌ను ప్రశ్నించడం ద్వారా ఈ కేసులో కీలక ఆధారాలను సేకరించాలని చూస్తోంది. ఫోన్ ట్యాపింగ్ పరికరాల ధ్వంసం , రాజకీయ నిఘా వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులను వెలికితీసే క్రమంలో ఈ విచారణ అత్యంత కీలకం కానుంది. కేసీఆర్ కోర్టుకెళ్తే ఇదే అంశాలపై తన వాదన సిట్ వినిపించే అవకాశం ఉంది.
