భారత రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ కోలుకున్నారు. ఆస్పత్రిలో తనను పరామర్శించేందుకు వచ్చిన నేతలతో సమావేశం అయ్యారు. రాజకీయ పరిణామాలపై మాట్లాడారు. ఆ దృశ్యాలను బీఆర్ఎస్ విడుదల చేసింది. కేసీఆర్ గురువారం సాయంత్రం తీవ్ర జ్వరంతో యశోధా ఆస్పత్రికి వచ్చారు. ఆయనను పరిశీలించిన డాక్టర్లు రెండు రోజులు ఆస్పత్రిలో చేరాలని సూచించారు. దాంతో అడ్మిట్ అయ్యారు. సుగర్ లెవల్స్ ఎక్కువగా.. సోడియం లెవల్స్ తక్కువగా ఉన్నట్లుగా పరీక్షల్లో తేలడంతో వాటిని సాధారణ స్థాయికి తెచ్చే ట్రీట్ మెంట్ ఇచ్చారు.
ఉదయం కేటీఆర్ కూడా కేసీఆర్ ఆరోగ్యంపై ట్వీట్ చేశారు. సాధారణ చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లారని.. రెండు రోజులు ఆస్పత్రిలో ఉండమని డాక్టర్లు సూచించారని తెలిపారు. అంతకు ముందు ఉదయం కల్వకుంట్ల కవిత కూడా కేసీఆర్ ను పరామర్శించి వెళ్లారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా కేసీఆర్ ను పరామర్శించారు. మేమిద్దరం కలిసి టిఫిన్ చేశారని.. కేసీఆర్ కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని మల్లారెడ్డి తెలిపారు.
కేసీఆర్ ఇటీవల పలుమార్లు ఏఐజీ ఆస్పత్రిలో టెస్టులు చేయించుకున్నారు. వయసురీత్యా వచ్చిన కొన్ని సమస్యల కారణంగా ఇబ్బంది పడుతున్నట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయంగా మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్న సమయంలో ఆరోగ్య సమస్యలు సవాల్‌గా మారుతున్నాయి.