కొత్త సెక్ర‌టేరియ‌ట్ కు గ్రేట‌ర్ ప్ర‌జ‌లు ఓకే అన్నారా..?

హైద‌రాబాద్ లో కొత్త స‌చివాల‌యం నిర్మించాల‌ని కేసీఆర్ స‌ర్కారు ఎప్పుడో నిర్ణ‌యించుకుంది! నిజానికి, ఇప్పుడున్న స‌చివాల‌యం రాష్ట్ర ప్ర‌భుత్వ అవ‌స‌రాల‌కు స‌రిపోతుంది. పదేళ్లు ఉమ్మ‌డి రాజ‌ధానిలో ఉండే అవ‌కాశం ఉన్నా కూడా, ముందుగానే ఇక్క‌డి నుంచి ఆంధ్రా స‌ర్కారు ఎప్పుడో ఖాళీ చేసింది. కొత్త స‌చివాల‌యం పేరుతో ప్ర‌జాధ‌నం దుర్వినియోగం చేయ‌డానికి స‌ర్కారు సిద్ధ‌మౌతోంద‌న్న విమ‌ర్శ‌లు చాలానే ఉన్నాయి. ఈ మ‌ధ్య‌నే ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీ కూడా కొత్త సెక్ర‌టేరియ‌ల్ నిర్మాణంపై ప్ర‌జా బ్యాలెట్ నిర్వ‌హించి, అధిక శాతం ప్ర‌జ‌లు దీనికి వ్య‌తిరేకంగా ఉన్నార‌నే తేల్చి చెప్పింది. ఇదే అంశంపై అసెంబ్లీలో భాజ‌పా నేత కిష‌న్ రెడ్డి మాట్లాడారు. అయితే, ఆయ‌న చేసిన విమ‌ర్శ‌ల‌కు కేసీఆర్ చెప్పిన సమాధానం చాలా విచిత్రంగా ఉంది!

ఇంత‌కీ, కిషన్ రెడ్డి ఏమ‌న్నారంటే.. సికింద్రాబాద్ నుంచి సెక్ర‌టేరియ‌ట్ కు రావ‌డానికి ప‌ది నిమిషాలు మాత్ర‌మే ప‌డుతుంద‌నీ, కావాలంటే ఫ్లై ఓవ‌ర్ కూడా వేసుకోవ‌చ్చ‌న్నారు. ప్ర‌స్తుతం ఉన్న స్థ‌లంలోనే అద్భుత‌మైన సెక్ర‌టేరియ‌ట్ నిర్మించుకోవ‌చ్చ‌న్నారు. అక్క‌డి నుంచి సెక్ర‌టేరియ‌ట్ ను డివైడ్ చేస్తే హైద‌రాబాద్ సెంటిమెంట్ దెబ్బ‌తింటుంద‌ని కిష‌న్ చెప్పారు. ఈ విష‌యంలో ప్ర‌భుత్వం మొండి వైఖ‌రితో ముందుకు పోతోంద‌నీ, ప్ర‌జాభిప్రాయానికి వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌జాధ‌నాన్ని దుర్వినియోగం చేస్తోంద‌న్నారు. ఉన్న సెక్ర‌టేరియ‌ట్ ను కూల్చేస్తాం, కొత్త‌ది క‌డ‌తాం అని ప్ర‌భుత్వం చేస్తున్న దురాలోచన‌కు వ్య‌తిరేకంగా ప్ర‌జ‌ల త‌ర‌ఫున భార‌తీయ జ‌న‌తా పార్టీ పోరాటం చేస్తుంద‌నీ, కేసీఆర్ స‌ర్కారు వైఖ‌రికి వ్య‌తిరేకంగా స‌భ నుంచి వాకౌట్ చేస్తున్నామ‌ని చెప్పారు. ఆ త‌రువాత‌, కిష‌న్ రెడ్డి విమ‌ర్శ‌ల‌ను తిప్పికొట్టేందుకు సీఎం కేసీఆర్ మాట్లాడారు. హైద‌రాబాద్ ప్ర‌జ‌ల అభిప్రాయానికి వ్య‌తిరేకంగా సెక్ర‌టేరియ‌ట్ క‌డుతున్నామ‌న‌డం త‌ప్పు అన్నారు. ఎందుకంటే, జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లో, వంద‌ల స‌భ‌ల్లో వంద‌ల ఉప‌న్యాసాల్లో ఈ విష‌యం ప్ర‌జ‌ల‌కు వివ‌రించామ‌న్నారు. హైద‌రాబాద్ ప్ర‌జ‌లు ఇచ్చిన ఆమోదంతోనే, జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతోనే క‌డుతున్నామ‌ని ముఖ్య‌మంత్రి చెప్పారు.

జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల తీర్పును సెక్ర‌టేరియ‌ట్ నిర్మాణానికి ప్ర‌జ‌లు ఇచ్చిన అనుమ‌తిగా కేసీఆర్ చెప్ప‌డం ఎంత‌వ‌ర‌కూ స‌రైంది..? అంటే, హైద‌రాబాద్ లో ప్ర‌భుత్వం ఏ కార్యక్ర‌మం చేప‌ట్టినా గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఫ‌లితాన్నే వాటికి అనుమ‌తి ప‌త్రంగా చూపిస్తారా..? నిజానికి, సెక్ర‌టేరియ‌ట్ విష‌యంలో కేసీఆర్ స‌ర్కారు మొండి వైఖ‌రితోనే ఉంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో కొత్త‌ది ఎందుకు నిర్మించాల‌నే ప్ర‌శ్న‌కు వారి ద‌గ్గ‌ర స‌రైన స‌మాధానం లేదు. పోనీ, వాస్తు బాలేద‌ని బాహాటంగా చెప్పేంత ధైర్యం కూడా వారికి స‌రిపోదు. కాబట్టి, ఈ చ‌ర్చ‌కు ఎలాగోలా ముగింపు ప‌ల‌కాల‌న్న ఉద్దేశంతోనే గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల ఇచ్చిన తీర్పునే స‌చివాల‌య నిర్మాణానికి ప్ర‌జ‌లు ఇచ్చిన ఆమోదంగా కేసీఆర్ చిత్రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.