కేసీఆర్ మొక్కుల ఖరీదు ఇప్పటికి రూ. 9 కోట్లు !

kcr

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తన పాతమొక్కులను తీర్చుకునే పనిలో ఉన్నారు. వరంగల్ భద్రకాళి అమ్మవారికి 3 కిలోల 700 గ్రాముల బంగారు కిరీటం, భుజకీర్తులను ఆయన దుర్గాష్టమి నాడు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. ఆయన తన సొంత డబ్బుతో ఈ మొక్కును తీర్చుకున్నారే స్థాయిలో ప్రచారం జరిగింది. నిజానికి అది ప్రజల సొమ్ము.  ఇందుకోసం ప్రజాధనం నుంచి 3 కోట్ల 60 లక్షల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసింది.

కేసీఆర్ ఇంకా చాలా మొక్కులు మొక్కారట. వాటికి కూడా ఖజానా నుంచే ఖర్చు చేస్తున్నారు. ఆయన మొక్కులు చెల్లించడానికి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 5 కోట్లు ఒక పద్దుగా, 59 లక్షలు మరో పద్దుగా విడుదల చేసింది. తిరుమల వేంకటేశ్వరుడికి, తిరుచానూరు పద్మావతీ అమ్మవారికి ఆయన మొక్కును చెల్లించాల్సి ఉంది. అలాగే బెజవాడ కనకదుర్గ అమ్మవారి మొక్కు కూడా చెల్లిస్తారట. ఉద్యమసారథిగా కేసీఆర్ మొక్కిన మొక్కులు ప్రజల తరఫున తీర్చడానికి ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు. అయితే, ఆయన భజనే పరమావధిగా భావించే కొన్ని మీడియా సంస్థలు ప్రజల ప్రమేయాన్నేపట్టించుకోని విధంగా రాతలు రాయడమే విడ్డూరం.

వరంగల్ కు కేసీఆర్ వెళ్తున్నారంటూ నాలుగు రోజులుగా ఈ మొక్కు గురించి మీడియాలో భారీగానే ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలు, కథనాలు ప్రసారమైన తీరు, ప్రచురితమైన తీరు చూస్తే ఆయన తన జేబులోంచి ఖర్చు పెడుతున్నారేమో అనిపించింది. ఇక, కొన్ని మీడియా సంస్థలైతే కేసీఆర్ మొక్కుల వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటూ కీర్తించాయి. దైవానికి మొక్కు తీర్చడం అనేది విశ్వాసానికి సంబంధించింది. మరి లక్షల మంది ప్రజలు ఉద్యమం చేయడం, వందల మంది ప్రాణత్యాగం చేయడాన్ని కూడా తక్కువ చేసినట్టు భావించేలా వార్తలు ఇవ్వడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది.

కేసీఆర్ మొక్కులు సెంటిమెoట్ల విషయంలో అయ్యే ఖర్చు ఎవరిదనే దానిపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పారదర్శకంగా లేదనే విమర్శలున్నాయి. గత ఏడాది డిసెంబర్లో ఆయన ఎర్రవల్లిలో ఆయుత చండీయాగం చేశారు. భారీ ఏర్పాట్లతో ఐదు రోజుల పాటు అత్యంత అట్టహాసంగా ఆ యాగం జరిగింది. దానికైన ఖర్చు సొంతమని, కాదు ఖజానా డబ్బని వినిపించింది. నిజానికి ఖజానా నుంచి ఖర్చు చేసి ఉంటే ఎంత ఖర్చయిందనేది ప్రజలు వివరించాలి. కానీ అలా జరగలేదు. తన స్నేహితుల సహాయంతో ఖర్చు చేస్తున్నాను అని ఒక్క మాట మాత్రం కేసీఆర్ చెప్పారు.

యాగానికి 7 కోట్ల రూపాయల దాకా ఖర్చయిందని కొన్ని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. కరువు కాలంలో రైతుల దుస్థితిని పట్టించుకోలేదని ప్రస్తావించాయి. ప్రయవేటు యాగానికి ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిండా తలమునకలైంది. వివిధ శాఖలు అది అధికారిక కార్యక్రమం అన్నంత పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశాయి. మరి వాటికైన ఖర్చు ప్రజాధనమే కదా అని ఆనాడే ప్రతిపక్షాలు విమర్శించాయి. ఆ వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశాయి.

బంగారు తెలంగాణ సాధిస్తానని చెప్తున్న కేసీఆర్, అందుకోసం వడివడిగా అడుగులు వేయాల్సి ఉంది. సెంటిమెంట్లు సరే. ప్రజాధనాన్ని వీలైనంత పొదుపుగా ఖర్చు చేస్తూ జనహితం కోసమే పని చేయాలన్నది ప్రతిపక్షాల మాట. దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదుగా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]