తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు పేద నోట్ల రద్దుతో ఏర్పడిన పరిస్థితుల గురించి చర్చిందడం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సూచనపై అకస్మాత్తుగా శుక్రవారం సాయంత్రం ఢిల్లీ కి బయలు దేరడం వెనుక రాజకీయ ఎత్తుగడ ఉన్నదని రాజకీయ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. బిజెపి తో దీర్ఘకాలంగా స్నేహంగా ఉంటున్న పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ తో సహా, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మినహా బిజెపి యేతర ముఖ్యమంత్రులు అందరూ ఈ విషయమై ప్రధాన మంత్రిని తప్పు పడుతూ ఉండగా రావు మాత్రం ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కేవలం సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని మాత్రమే కోరుతున్నారు.
ప్రధాన మంత్రి ని శనివారం కలసిన సమయంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ఆసరా చేసుకొని కేసీఆర్ నిర్దుష్టమైన రాజకీయ సంబంధ ఏర్పరచుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. కేంద్ర మంత్రి వర్గంలో చేరాలని చాలాకాలంగా ఆరాట పడుతున్న నిజామాబాదు యంపీ అయిన కూతురు కవిత రాజకీయ భవిష్యత్ గురించి నిర్దుష్టమైన సంకేతం ఇవ్వగలరని అనుకొంటున్నారు.
మంత్రి పదవి కోసం, ప్రధాని, ఇతర కేంద్ర మంత్రులతో సన్నిహితంగా మెలుగుతున్న ఆమె వారి వైపు నుండి సానుకూల సంకేతాలు రాకపోవడంతో నిరాశతో మోడీ ప్రభుత్వంపై ఇ మధ్యన ఘాటయిన విమర్శలు చేయడం ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను పటించుకోవడం లేదని కూడా అన్నారు. అయితే కొంత సంయమనం పాటించాలని తండ్రి మందలించడంతో ఆమె రెండు నెలలుగా ఈ విషయమై మౌనంగా ఉంటున్నట్లు తెలుస్తున్నది.
ఇప్పటికే ఢిల్లీ లో మకాం వేసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బనెర్జీ తో కలసి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నోట్ల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించు కోవడానికి మూడు రోజుల గడువు విధించారు. లేని పక్షంలో తమ ఉద్యమాన్ని ఉధృతం చేయగలమని హెచ్చరించారు. మరో వంక పార్లమెంట్ లో ప్రతిపక్షాలు అన్ని కలసి ప్రధానమంత్రిపై దాడి చేస్తున్నాయి. అయినా ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు ఏవీ ప్రభుత్వానికి మద్దతుగా నిలబడటం లేదు. ఇటువంటి సమయంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటన విశేష ప్రాముఖ్యతను సంతరింప చేసుకొంది.
ప్రధాన మంత్రి సహితం దీనిని అవకాశంగా తీసుకొని కేసీఆర్ తో రాజకీయంగా సంబంధాలు ఏర్పర్చుకొనే విషయమై ఒకడుగు ముందుకు వేసే అవకాశాలు సహితం కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికల నాటికి బిజెపి యంపీల సంఖ్య తగ్గే అవకాశం ఉండటంతో మరిన్ని ప్రాంతీయ పార్టీలను దగ్గరకు చేర్చుకోవాలని ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా కవితకు మంత్రి పదవి ఇవ్వడానికి ఆయన విముఖంగా ఉండే అవకాశాలు లేవని స్థానిక బిజెపి వర్గాలు కూడా భావిస్తున్నాయి.
ఢిల్లీ వెళ్లే ముందు ప్రతిపక్షాల ఆందోళనలో చేరవద్దని తన పార్టీ యంపీ లకు కేసీఆర్ ఆదేశాలు ఇవ్వడం ఈ సందర్భంగా ఆసక్తి కలిగిస్తున్నది. గత రాత్రి పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు జితేంద్ర రెడ్డి కి ఫోన్ చేసి ప్రతిపక్షాల ఆందోళనలో పాల్గొనవద్దని స్పష్టం చేసిన్నట్లు తెలుస్తున్నది. గురువారం లోక్ సభ లో నోట్ల రద్దు పై చర్చ వెంటనే చేపట్టాలని ఇతర ప్రతిపక్షాలతో కలసి టీ ఆర్ యస్ యంపీ లు సహితం ఆందోళన చేయడం గమనార్హం. నిరసనలకు దూరంగా ఉండటమే కాకుండా స్పీకార్ పోడియం వద్దకు వెళ్లవద్దని, లోక్ సభ కార్యకలాపాలకులకు ఆటంకం కలిగించవద్దని కూడా స్పష్టం చేశారు.
కాగా, ప్రధానిని కలసిన సమయంలో నోట్ల రద్దుతో తెలంగాణ ఆదాయ వనరులపై ప్రతికూల ప్రభావం చూపి 2017-18 బడ్జెట్ లో ఇబ్బందులు కలిగించే అవకాశం ఉన్నందున కేంద్ర నుండి ప్రత్యేక సహాయం కోరాలని రావు నిర్ణయించుకున్నారు. అదే విధంగా రు 2.5 లక్షల డిపాజిట్ చేసిన వారందరిని `నల్ల డబ్బు’ ఉన్నవారుగా చూడకుండా, లెక్క చెప్పని డబ్బుగా చూడాలని, చిన్న చిన్న వ్యాపారులు, అసంఘటిత రంగంలోని వారికి మరి కొన్ని రాయితీలు ఇవ్వాలని ప్రధానికి సూచించాలని భావిస్తున్నారు. స్వచ్చంధంగా తమ ఆదాయాన్ని వెల్లడించడం కోసం వారికి మరో అవకాశం ఇవ్వాలని కూడా చెప్పాలని అనుకొంటున్నారు.