అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు అనధికారికంగా చెబుతున్నాయి. అధికారికంగా మాత్రం చెప్పడంలేదు. శుక్రవారం పార్టీ నేతలతో ఫామ్ హౌస్లోసమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు అసెంబ్లీకి హాజరు కావాలని అడిగినట్లుగా తెలుస్తోంది.దానికి కేసీఆర్ అంగీకరించారని అంటున్నారు. అయితే ఈ విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ప్రకటించడం లేదు.
కేసీఆర్ అసెంబ్లీకి హాజరైతే బీఆర్ఎస్ పార్టీకి ఓ ఊపు వస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకూ ఒకటి, రెండు సార్లు అసెంబ్లీకి వచ్చినా హాజరు కోసం అన్నట్లుగా వచ్చి వెళ్లారు కానీ ఎలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోలేదు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే .. కాంగ్రెస్ కకావికలం అవుతుందన్న ప్రకటనలు కేటీఆర్ నుంచి వస్తున్నాయి. అన్నీ చెబుతున్నారు కానీ కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని చెప్పడం లేదు. ఆయన హాజరు కారు అన్న సంకేతాలే ఎక్కువగా వస్తున్నాయి.
పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయం తీసుకుంటే ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించి..రేవంత్ విసురుతున్న సవాళ్లకు ప్రతి సవాల్ విసరవచ్చు. బస్తీ మే సవాల్ తేల్చుకుందామని ప్రకటనలు చేస్తే రేవంత్ దూకుడుగా గట్టిగా సమాధానం ఇచ్చినట్లవుతుంది. కానీ ఇలా లీకులు ఇచ్చి ఆయన హాజరవుతారన్న ఆశలు రేపితే .. పెద్దగా ప్రయోజనం ఉండదు.
కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావాలనుకుంటే గతంలోనే వచ్చి ఉండేవారు. రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడం ఆయనకు పెద్ద విషయం కాకపోవచ్చు కానీ..సభాధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి ఉండటం, తాను ప్రతిపక్ష నేత అనే భావన కేసీఆర్కు సరిపడటం లేదని అందుకే హాజరు కావడం లేదని అంటున్నారు. కానీ ప్రజాస్వామ్యంలో పదవులన్నీ ప్రజలు ఇచ్చేవే కాబట్టి కేసీఆర్ మనసు మార్చుకుంటే మాత్రం అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతాయి.
