తెలంగాణ ప్రభుత్వానికి కావాల్సినంత సమయం ఇచ్చామని ఇవాళ్టి నుంచి ఓ కథ.. రేపట్నుంచి మరో కథ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఉద్యమ కార్యచరణ ప్రకటించేందుకు ఎల్పీ సమావేశాన్ని తెలంగాణ భవన్ లో నిర్వహించారు. మూడు గంటల పాటు విస్తృతంగా చర్చించిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సుదీర్ఘంగా మాట్లాడారు.
ప్రధానంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు గురించే మాట్లాడారు. ఆ ప్రాజెక్టు డీపీఆర్ ను కేంద్రం వెనక్కి పంపిందని అయినా రాష్ట్ర ప్రభుత్వం సైలెంట్ గా ఉందని ఆరోపించారు. బీజేపీ, చంద్రబాబు కలిసి ఆ డీపీఆర్‌ను వెనక్కి పంపాయని కేసీఆర్ ఆరోపించారు. పాలమూరుకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు ఉన్నాయని తీసుకెళ్లడానికి ఎందుకు ప్రభుత్వం ప్రయత్నించడం లేదని కేసీఆర్ ప్రశ్నించారు. తమ హయాంలో పాలమూరు రంగారెడ్డికి రూ. 27 వేల కోట్లు ఖర్చు పెట్టామని.. మోటార్లు కూడా పెట్టామన్నారు. ఆ ప్రాజెక్టును తాము 80-90 శాతం పూర్తి చేశామని స్పష్టం చేసారు.
ఎంత దద్దమ్మ ప్రభుత్వం అయినా ప్రాజెక్టులు కొనసాగించాలి కదా అని కేసీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సర్వభ్రష్ట ప్రభుత్వమన్నారు. తెలంగాణకు అన్యాయం జరుగుతూంటే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. తాము ఉద్యమిస్తున్నామని వచ్చే పదిహేను రోజుల్లో మూడు సభలు పెడుతున్నామని దానికి తాను కూడా హాజరవుతాన్నారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం లేదని.. నిద్రపోతోందన్నారు. ఎంత సేపు భూములు అమ్ముకుందామనే యావలో ఉంటున్నారని విమర్శించారు. ప్రభుత్వం నోరు మూసుకుని ఉంటే తాము అయినా రంగంలోకి దిగాలి కదా అని ప్రశ్నించారు.
అంతకు ముందు కేసీఆర్ పాలమూరు నీటి కష్టాల గురించి సుదీర్ఘంగా చెప్పారు. పదేళ్ల పాటుతాను అధికారంలో ఉన్నప్పుడు చెక్ డ్యాములు కట్టామన్నారు. చంద్రబాబు ఎక్కడపడితే అక్కడ పునాది రాళ్లువేశారన్నారు కానీ.. పనులు చేయలేదన్నారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్న తొమ్మిదిన్నరేళ్ల కంటే కేసీఆర్ తెలంగాణకు సీఎంగా ఉన్నారు. ఆయన పాలమూరులో ఎన్ని ప్రాజెక్టులకు పునాది రాళ్లు వేశారో.. పూర్తి చేశారో.. రేపు కాంగ్రెస్ వాళ్లు బయట పెట్టే అవకాశం ఉంది. మొత్తంగా దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ కాస్త ఫలితాలు సాధిస్తోంది.. పూర్తిగా ఆ ప్రాంతంపై దృష్టి పెట్టాలన్నట్లుగా కేసీఆర్ ప్రణాళికలు రెడీ చేసినట్లుగా భావిస్తున్నారు.