కల్వకుంట్ల కవితతో బీఆర్ఎస్ ఎంపీ దామోదర్ రావు దాదాపుగా మూడు గంటల పాటు చర్చలు జరిపారు. లీగల్ సెల్‌కు చెందిన మరో నేతతో కలిసి కవిత ఇంటికి దామోదర్ రావు వెళ్లారు. ఆయన ఎంపీ మాత్రమే కాదు.. కేసీఆర్ కుటుంబానికి బాగా దగ్గర. బంధువు కూడా. కవితతో మాట్లాడాలని ఆయనను కేసీఆరే పంపించారన్న ప్రచారం జరుగుతోంది.
ఈ చర్చల్లో ఏం మాట్లాడారో తెలియదు కానీ.. కాసేపటికి కవిత వాయిస్ లో స్పష్టమైన మార్పు కనిపించింది. సోదరుడు కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేయడంపై ఘాటుగా స్పందించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్ కి నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాననని ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు స్పష్టమవుతోంది. మా పార్టీ నాయకులకు వరుస నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు తేటతెల్లమైందన్నారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ సైనికులదిని స్పష్టం చేశారు.
కవిత స్పందన బీఆర్ఎస్ వర్గాలను సంతోషపరుస్తోంది. కొత్త పార్టీ అంటూ జరుగుతున్న ప్రచారంతో వారు డీలా పడి ఉన్నారు. కానీ కవిత మాత్రం.. హఠాత్తుగా కేటీఆర్ కు మద్దతుగా మాట్లాడారు. అసలు కేటీఆర్ తోనే సమస్య అని అనకుంటున్నారు. కేటీఆర్ కూడా అంతర్గత సమస్యలు అంతర్గతంగానే మాట్లాడాలన్న హెచ్చరికలు జారీ చేశారు. కానీ కవిత అవేమీ మనసులో పెట్టుకోకుండా సోదరుడికి మద్దతు పలికారు.