తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు కేసీఆర్ హాజరుపై ఉత్కంఠ కొనసాగుతోంది. కేసీఆర్ హాజరవుతారని కానీ.. హాజరు కారు అని కానీ ఇప్పటి వరకూ ప్రకటన చేయలేదు. రెండు రోజుల కిందట పార్టీ ముఖ్యనేతలతో సమావేశం జరిగినప్పుడు తాను అసెంబ్లీకి వస్తానని కేసీఆర్ చెప్పినట్లుగా ప్రచారం జరిగింది.కానీ ఆయన వస్తారని అధికారికంగా ప్రకటించలేదు.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న సమయంలో కేసీఆర్ నందినగర్ నివాసానికి ఆదివారం చేరుకోవడంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు అసెంబ్లీకి హాజరవుతారని గట్టి నమ్మకంతో ఉన్నారు. అయితే కేసీఆర్ , కేటీఆర్ వైపు నుంచి ఇంకా ఆ అంశంపై స్పష్టత రాలేదు. కాంగ్రెస్ నేతలు అదే పనిగా సవాళ్లు చేస్తున్నందున..కేసీఆర్ హాజరు కాకపోతే బాగుండదని అనుకుంటున్నారని.. హాజరవుతారని అంటున్నారు.
కానీ కేసీఆర్ అసెంబ్లీకి హాజరైనా…హాజరు వేయించుకుని గంటలో వెళ్లిపోతారని మరికొందరు చెబుతున్నారు. అనర్హతా వేటు పడకుండా ఉండేందుకు అప్పుడప్పుడల్లా ఓ గంట వచ్చి పోతున్నారని అంటున్నారు. గతంలో గవర్నర్ ప్రసంగం సమయంలో ఓ సారి.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కోసం మరోసారి వచ్చారు. ఇప్పుడు పూర్తి స్థాయి అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే మాత్రం.. అసెంబ్లీ హాట్ హాట్ గా సాగడం కాయమని అనుకోవచ్చు.
