పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ముందుగా వ్యతిరేకించింది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ నిర్ణయంతో అభివృద్ధిపై ఉక్కుపాదం అనే స్థాయిలో ఆయన విమర్శించారు. అయితే, ఆ తరువాత ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసి వచ్చాక… ఢిల్లీ నుంచి ప్రధాని హైదరాబాద్‌కు వచ్చాక కేసీఆర్ వైఖరి దశలవారీగా పూర్తిగా మాపోయింది. మోడీ సర్కారు నిర్ణయం అదరహో అనే స్థాయిలో వంతపాడటం మొదలుపెట్టారు. కేసీఆర్‌కు మోడీ భరోసా ఇవ్వడంతోనే ఈ మార్పు అనే విమర్శలు కూడా వినిపించాయి. ఇదే విమర్శలకు కొనసాగింపుగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి.
ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద పెద్ద ఎత్తున డబ్బు ఉందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయని జైపాల్ వ్యాఖ్యానించడం విశేషం! పెద్ద నోట్ల రద్దు తరువాత ప్రధాని మోడీ నిర్ణయంపై విమర్శలు చేసిన కేసీఆర్, ఢిల్లీ వెళ్లి ఆయన్ని కలిసి రాగానే అభిప్రాయాన్ని మార్చుకోవడం వెనక కొన్ని అనుమానాలు వ్యక్తమౌతున్నాయన్నారు. దేశంలోని ఏ ముఖ్యమంత్రి ఆ తరుణంలో ఢిల్లీకి వెళ్లలేదనీ, కేసీఆర్ మాత్రమే ఢిల్లీకి వెళ్లి ప్రధానిని ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ అనుమానం వ్యక్తం చేశారు. మొత్తంగా ఈ వ్యవహారంపైనే చాలా అనుమానాలు వ్యక్తమౌతున్నాయనీ, అంతకంటే ఎక్కువ తాను మాట్లాడనని జైపాల్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయమై ఇంతకంటే ఎక్కువగా మాట్లాడటం సరికాదనీ, ఎక్కువ మాట్లాడితే చెప్పేవన్నీ ఊహాగానాలు అయిపోతాయని అన్నారు.
తనలాంటి అనుభవజ్ఞులైనవారు కేసీఆర్ స్థాయికి దిగిపోయి, ఇష్టం వచ్చినట్టు విమర్శలూ ఆరోపణలూ చెయ్యరంటూ ముఖ్యమంత్రిపై వ్యంగ్యాస్త్రం సంధించారు. కాంగ్రెస్ నేతల దగ్గర బ్లాక్‌మనీ ఉందని అనుకుంటే ఐటీ అధికారులతో దాడులు చేయించుకోవచ్చని సూచించారు. మొదట్నుంచీ భాజపాకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనీ, గడచిన ఆరేళ్లుగా అదే ప్రయత్నంలో ఉన్నారని అన్నారు. అయితే, ప్రస్తుతం భాజపా, కేసీఆర్‌ల మధ్య ఉన్న అనుబంధం ఏంటో ఎవ్వరికీ తెలీదన్నారు!
జైపాల్‌రెడ్డి చేసిన ఆరోపణ చిన్నదేం కాదు. కేసీఆర్ దగ్గర పెద్ద ఎత్తున సొమ్ముందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయన్నారు.. బాగానే ఉంది. అంతకంటే ఎక్కువ మాట్లాడటం తన స్థాయికి తగదని హుందాతనం ప్రదర్శించారు… అదీ బాగానే ఉంది. మరి, ఆ స్థాయిలో విమర్శలు చేసినప్పుడు కేసీఆర్ దగ్గర సొమ్ము ఎక్కుడుందో… ఎంత దాచారో…. ఏ రూపంలో దాచారో కూడా సూచనప్రాయంగానైనా జైపాల్ చెప్పి ఉంటే చేసిన విమర్శలకు ఇంకాస్త బలం చేకూరేది కదా!