కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి ఆదివారమే ముహుర్తం ఖరారు చేసింది. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో సిద్ధమయింది. కానీ బీఆర్ఎస్ వ్యూహంపైనే స్పష్టత లేదు. రిపోర్టును అసెంబ్లీలో పెట్టకుండా ఆపాలని హరీష్ రావు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతోనే వారి ఆత్మరక్షణ ధోరణి బయటపడిందేనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీలో ఎలా ఎదుర్కొంటారన్నది ప్రధాన ప్రశ్న.
కాళేశ్వరంలో జరిగిన ప్రతి తప్పులకు బాధ్యత కేసీఆర్‌దేనని రిపోర్టులో ఉంది. ఆయన ఇతరులతో తప్పులు చేయించారని తేల్చారు . అలాంటి సమయంలో కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తన వాదన గట్టిగా వినిపించాల్సి ఉంది. అసెంబ్లీకి వచ్చి..రిపోర్టుపై తన వాదన వినిపించడానికి అధికార పార్టీ అడ్డంకులు కలిగిస్తే ఆ విషయం ప్రజలు చూస్తారు. ఆ రిపోర్టును కేసీఆర్ చీల్చి చెండాడుతారని అందుకే మాట్లాడనివ్వడం లేదని నిర్ణయానికి వస్తారు. అప్పుడు ఆ రిపోర్టుపై ప్రజల్లో విశ్వసనీయత తగ్గిపోతుంది. అలా కాకుండా అసలు అసెంబ్లీకే హాజరు కాకపోతే.. బీఆర్ఎస్ వాదన ప్రజల్లోకి గట్టిగా వెళ్లదు.
కాళేశ్వరం అంశంపై హరీష్ రావుకు ఎక్కువ స్పష్టత ఉంది. హరీష్ రావు పదేళ్ల కాలంలో తొలి విడతలో నీటిపారుదల మంత్రిగా చేశారు. రెండో విడతలో చేయలేదు..కానీ ప్రాజెక్టులపై ఆయనకు చాలా స్పష్టత ఉంది. ఆయన మాట్లాడవచ్చు. కానీ కేసీఆర్ మాట్లాడే మాటలకు.. హరీష్ మాట్లాడే మాటలకు వాల్యూయేషన్‌లో తేడా ఉంటుంది. ప్రతిపక్ష నేతగా హరీష్ రావు ఉన్నా కాస్త వెయిటేజీ వస్తుంది. కానీ పార్టీలో ఉన్న విలువ ప్రకారం చూసినా అసెంబ్లీలో ఆయన మాటలకు అంత విలువ రాదు.
కేసీఆర్ అసెంబ్లీకి రావడానికి ఇంత కన్నా గొప్ప అవకాశం రాదు. రాకపోతే పారిపోయారని అనుకుంటారు. ఆయనకు అనారోగ్యమని.. ఆ కారణంగా రాలేకపోతున్నారని అయినా బీఆర్ఎస్ కవర్ చేసుకోవడం లేదు. అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్టుపై కాంగ్రెస్ దాడిని సరిగ్గా ఎదుర్కోలేకపోతే.. ఆ ప్రభావం పార్టీపై.. కేసీఆర్ ఇమేజ్ పై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. బీఆర్ఎస్ కు యుద్ధం చేయడం తప్ప మార్గం లేదు.