రజతోత్సవ సభపై బీఆర్ఎస్ భారీ అంచనాలు పెట్టుకుంది. ఈ సభతో తెలంగాణ అంతా బీఆర్ఎస్ , కేసీఆర్ తోనే ఉందని నిరూపించాలని తెగ తాపత్రయపడుతున్నారు. ఇందుకోసం భారీగా జనసమీకరణ చేపట్టాలని నేతలకు కేసీఆర్ బాధ్యతలు అప్పగించేశారు. ఈమేరకు కేటీఆర్ , కవిత తలోదారి ఎంచుకొని సన్నాహక తెలంగాణను చుట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, వీరిని ఓ భయం వెంటాడుతోంది.
రజతోత్సవ సభకు వచ్చే ప్రజలు, కార్యకర్తల సౌకర్యార్థం 3వేలకుపైగా ఆర్టీసీ బస్సులను బుక్ చేసింది బీఆర్ఎస్. ఇందుకోసం 8 కోట్లను ఆర్టీసీకి చెల్లించింది. వీటితోపాటు ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన మూడువేలకుపైగా బస్సులను బుక్ చేశారు. మరో నాలుగు వేల బస్సులను స్కూళ్లు, వివిధ సంస్థల నుంచి తీసుకుంటున్నారు.
అసలే ఎండాకాలం.. భయంకరమైన ఎండలు జనాల్ని భయపెడుతున్నాయి. మధ్యాహ్నం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఉత్తర తెలంగాణ అయితే సెగలు కక్కుతోంది. దీంతో ఈ సభకు బీఆర్ఎస్ నిర్దేశించుకున్నట్లుగా జనం హాజరు అవుతారా అనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ సభకు వచ్చే జనాల సంఖ్య ఓ మైలురాయి కావాలని ఆశపడుతోంది గులాబీ అధినాయకత్వం. 10లక్షల మంది వస్తారని చెబుతున్నారు. కానీ, ఈ ఎండలకు అంత జనం వస్తారా? అని బీఆర్ఎస్ టెన్షన్ పడుతోంది.
సభకు నిర్దేశించుకున్నట్లుగా జనసమీకరణ లేకపోతే అభాసుపాలు అవుతామని కేసీఆర్ , కేటీఆర్ , కవితలకు చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకే తలోదారి ఎంచుకొని పర్యటిస్తున్నా.. ఎక్కడో మూల ఈ ఇద్దరిలో టెన్షన్ నెలకుందని అంటున్నారు. హరీష్ రావు యాక్టివ్ లేకపోవడంతో కేసీఆర్ ఇచ్చిన ఈ టాస్క్ ను సవాల్ గా తీసుకొని వర్క్ చేస్తున్నా..ఆశించిన ఫలితం లేకపోతే ఎలా అన్నది కేటీఆర్ , కవితలను వేధిస్తున్న ఆందోళన.