ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలని సిట్ ఇచ్చిన నోటీసుల్ని కేసీఆర్ లైట్ తీసుకున్నారు. లా పాయింట్లతో వారు ఒక్క పేజీలో నోటీసు ఇస్తే.. తాను రెండు పేజీలతో రిప్లయ్ ఇచ్చారు. తాను క్షణం తీరిక లేనంత బిజీగా ఉన్నానని చెప్పడమే కాదు.. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఎర్రెవెల్లికే వచ్చిన సందేహాలు తీర్చుకోవచ్చని సలహా కూడా ఇచ్చారు.
శుక్రవారం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు నామినేషన్లకు చివరి రోజు అని పార్టీ తరపున అభ్యర్థులకు బి-ఫారాలు, ఇతర అధికారిక అనుమతులు ఇచ్చే ప్రక్రియలో తాను బిజీగా ఉన్నానని, కాబట్టి శుక్రవారం విచారణకు హాజరు కాలేనని కేసీఆర్ స్పష్టం చేశారు. నిజానికి మున్సిపల్ అభ్యర్థులకు పార్టీ అధ్యక్షుడు బీఫామ్స్ ఇవ్వరు. కానీ కేసీఆర్ అదే చెప్పారు. అదే సమయంలో ఈ సందర్భంగా కేసీఆర్ చట్టంలోని నిబంధనలను పోలీసులకు గుర్తు చేశారు.
సెక్షన్ 160 CrPC 65 ఏళ్లు పైబడిన వాళ్లను , దివ్యాంగులను పోలీస్ స్టేషన్కు పిలవకూడదని, వారి నివాస స్థలంలోనే విచారించాలన్నారు. తన అడ్రస్ చెప్పి.. అక్కడే ఉంటున్నానని మున్సిపల్ ఎన్నికల తర్వాత అక్కడికే వచ్చి ప్రశ్నించాలని చెప్పారు. ఏ నోటీసులైనా ఎర్రవల్లి చిరునామాకే పంపాలని సూచించారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిగా, ప్రస్తుత అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా, దేశ బాధ్యతాయుత పౌరుడిగా దర్యాప్తుకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.
కేసీఆర్ ఇచ్చిన సమాధానంతో సిట్ ఏం చేస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరమైన అంశం. ఆయనపై దూకుడుగా వ్యవహరించే అవకాశాలు ఉండకపోవచ్చునని ఆయన కోరిక మేరకు ఎర్రవెల్లికే వెళ్లి ప్రశ్నించవచ్చు కానీ.. అది మున్సిపల్ ఎన్నికల కంటే ముందుగానే ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.
