ప్రముఖ రచయిత, సంగీత దర్శకుడు కీరవాణి తండ్రి శివశక్తిదత్తా (92) మృతి చెందారు. పాటల రచయితగా, స్క్రీన్ ప్లే రైటర్ గా గుర్తింపు సంపాదించుకొన్నారు శివశక్తి దత్తా. సోమవారం రాత్రి హైదరాబాద్ లోని మణికొండలో అనారోగ్య కారణాలతో తుది శ్వాస విడిచారు. స్క్రీన్ ప్లే రైటర్‌గా తన ప్రయాణం ప్రారంభించారు శివశక్తి దత్తా. ‘జానకీరాముడు’ చిత్రానికి ఆయన పని చేశారు. ఆ తరవాత పాటలు రాశారు. సంస్క్రృత శ్లోకాలతో పాటలు రాయాల్సివచ్చినప్పుడు ఆయన కలం ఇంకా గంభీరంగా పలికేది. రాజమౌళి చిత్రాల్లో ఆయన రాసిన పాటలకు మంచి గుర్తింపు వచ్చింది. బాహుబలిలో మమతల తల్లి, ధీవర పాటలు ఈయన రాసినవే. ఆర్.ఆర్.ఆర్‌లో ‘రామం – రాఘవం’ పాట కూడా పాపులర్ అయ్యింది. ‘రాజన్న’, ‘హను – మాన్’ లాంటి చిత్రాల్లోనూ పాటలు రాశారు.
శివశక్తి క్లాస్ గీతాలే కాదు… మాస్ మసాలా పాటలూ రాశారు. ఛత్రిపతిలో ‘మన్నేల తింటివిరా’, సైలో ‘నల్లా నల్లాని కళ్ల’ పాటలు శివశక్తి దత్తాలోని మరో కోణాన్ని ఆవిష్కరించాయి. శివశక్తి దత్తా ఆహార్యం కూడా విచిత్రంగా ఉంటుంది. రంగు రంగుల వస్త్రాలతో దర్శనమిచ్చేవారు. ఎప్పుడూ యవ్వనంతో కనిపించాలన్న తాపత్రయం ఉండేది. ఆయన మంచి చిత్రకారుడు కూడా. సంగీతంపై కూడా పట్టుంది. గిటార్, సితార, హార్మోనియం లాంటి వాయిద్యాలు వాయించగలరు. శివశక్తి దత్తా అసలు పేరు కోడూరి సుబ్బారావు. కమలేశ్ అనే కలం పేరు కూడా వుంది.