డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇవ్వాళ్ళ డిల్లీ శాసనసభలో భాజపా సభ్యుడు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ ప్రధాని నరేంద్ర మోడి, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ల విచిత్రమయిన స్నేహం గురించి ఒక మంచి పంచ్ డైలాగ్ కొట్టేరు. “డిల్లీలో పక్కనే ఉన్న నన్ను, నా ప్రభుత్వాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సహించలేకపోతున్నారు కానీ శత్రుదేశమయిన పాకిస్తాన్ తో, దాని ప్రధాని నవాజ్ షరీఫ్ తో మాత్రం చాలా స్నేహంగా మసులుకొంటున్నారు,” అని చురకలు వేశారు.
తన ప్రభుత్వం పట్ల మోడీ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని అరవింద్ కేజ్రీవాల్ అసంతృప్తి వ్యక్తం చేసారు. భారత్ పై తరచూ దాడులు చేస్తున్న పాక్ తో మోడీ అంత చక్కగా వ్యవహరిస్తునప్పుడు ఒకే దేశానికి చెందిన తమ ప్రభుత్వంతో ఎందుకు అదేవిధంగా స్నేహపూర్వకంగా ఉండలేకపోతున్నారని ప్రశ్నించారు. నవాజ్ తో చేతులు కలపడానికి లాహోర్ దాకా వెళ్ళిన పక్కనే ఉన్న తనను ఎందుకు శత్రువుగా భావిస్తున్నారని ప్రశ్నించారు. కేంద్రం తమతో ఎప్పుడూ ఘర్షణ వైఖరినే ప్రదర్శిస్తున్నప్పటికీ, తాము మాత్రం కేంద్రంతో సానుకూల ధోరణితోనే ముందుకు వెళతామని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.
ఆమాద్మీ పార్టీ చేతిలో భాజపా ఓడిపోయినంత మాత్రాన్న మోడీ సర్కార్ డిల్లీ ప్రభుత్వాన్ని, దాని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని శత్రువుగా భావించనవసరం లేదని అందరికీ తెలుసు. బిహార్ ఎన్నికలలో లాలూ, నితీష్ కుమార్ చేతుల్లో భాజపా ఓడిపోయినా తరువాత మళ్ళీ వారితో ఘర్షణ పడేందుకు మోడీ ఎన్నడూ ప్రయత్నించలేదు. పైగా ఈ మధ్యనే ఆయన బిహార్ వెళ్లి అక్కడ ఒక రైల్వే ప్రాజెక్టుని ఆరంభిస్తూ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ని, ఆయన పరిపాలనని చాలా మెచ్చుకొన్నారు. బిహార్ అభివృద్ధికి ఆయన చాలా కృషి చేస్తున్నారని ఆయనకి కేంద్రప్రభుత్వం తరపు నుంచి పూర్తి సహాయసహకారాలు అందిస్తామని ప్రధాని నరేంద్ర మోడి బహిరంగంగా ప్రజల ముందు మాట ఇచ్చి వచ్చేరు. కానీ అరవింద్ కేజ్రీవాల్ తో ఏనాడూ ఆయన ఆ విధంగా వ్యవహరించలేదు. డిల్లీ ప్రభుత్వం పట్ల సానుకూలంగా వ్యవహరించకపోగా, దానితో నిత్యం ఏదో ఒక విషయంలో ఘర్షణ వైఖరి అవలంభిస్తున్నారు. అందుకే అరవింద్ కేజ్రీవాల్ ఇవ్వాళ్ళ అదును చూసి మోడీపై మంచి పంచ్ డైలాగ్ కొట్టారు.
ఈ పంచ్ డైలాగ్ కేవలం పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, మోడీల స్నేహానికే కాక వివిధ దేశాధినేతలతో మోడీ రాసుకుపూసుకు తిరగడానికి కూడా అన్వయించుకొన్నట్లయితే, యావత్ ప్రపంచాన్ని మంచి చేసుకోవాలని ప్రయత్నిస్తున్న మోడీ, దేశంలోని అరవింద్ కేజ్రీవాల్, హరీష్ రావత్, నబం తూకి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ మొదలయిన వారితో ఎందుకు అంతే సఖ్యతగా ఉండలేకపోతున్నారని ప్రశ్నించుకోవచ్చును. కానీ దానికి సమాధానం ఆయనే చెప్పాల్సి ఉంటుంది.