హిందీలో వందకోట్లు సాధించిన చిత్రాలని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయడం రివాజుగా మారింది. మొన్న ఛావా సినిమాని గీతా ఆర్ట్స్ తెలుగు ప్రేక్షకులకు చేరవేస్తే.. సురేష్ ప్రొడక్షన్ ‘కేసరి: ఛాప్టర్ 2’ని తాజాగా తెలుగులో తీసుకొచ్చింది. అక్షయ్ కుమార్ నటంచిన ఈ సినిమా హిందీలో ఘన విజయాన్ని అందుకుంది. రఘు, పుష్ప పలాట్ రచించిన ‘ది కేస్ దట్ షుక్ ది ఎంపైర్’ నవల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రానికి కరణ్ సింగ్ దర్శకత్వం వహించారు. భారత స్వాతంత్రోద్యమ నెత్తుటి అధ్యాయం1919లో జరిగిన జలియన్‌వాలా బాగ్ మారణకాండకు కారకులు ఎవరు? దోషులు తప్పించుకోవడానికి ఎలాంటి ఎత్తులు వేశారు? ఈ న్యాయ పోరాటంలో ఎలాంటి ఘట్టాలు వున్నాయి?
రౌలత్ చట్టాన్ని వ్యక్తితిరేకిస్తూ దేశ ప్రజలు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రోజులవి. పంజాబ్‌లోని అమృతసర్‌లోని జలియాన్‌వాలా బాగ్‌లో వార్షిక వసంత ఉత్సవం వైశాఖిని వేడుకల కోసం వేలమంది ప్రజలు ఒక్క చోటికి చేరారు. ఈ శాంతియుత సభను రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనగా ఊహించి అప్పటి పంజాబ్ జనరల్ డ్వేయర్ (మార్క్ బెన్నింగ్టన్) అక్కడ గుమిగూడిన ప్రజలని ఊచకోత కోశాడు. తప్పించుకోవడానికి వీలు లేకుండా నాలుగు వైపులు బంధించి అతి కిరాతకంగా కాల్పులు జరిపాడు. ఈ ఘోర మారణ హోమాన్ని కప్పిపుచ్చడానికి నాయన్ని కోనేయాలని చూస్తాడు. అసలు ఇలాంటి ఘటన జరగలేదని కోర్టుని నమ్మించాలని చూస్తాడు. ఈ క్రమంలోనే బ్రిటిష్ వైస్రాయ్ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్న భారత న్యాయవాది శంకరన్ నాయర్ (అక్షయ్ కుమార్)తో ఓ కమిషన్‌ను ఏర్పాటు చేసి, తమ చర్యను సమర్థించేలా రిపోర్ట్ ఇవ్వాలని కోరతాడు. అయితే జలియన్‌వాలా బాగ్ నెత్తుటి దమనకాండ తెలుసుకున్న శంకరన్ బ్రిటిష్ ప్రభుత్వంలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి జనరల్ డ్వేయర్పై కేసు వేస్తాడు. ఈ కేసులో మైఖేల్ డ్వేయర్ తనని కాపాడుకునేందుకు న్యాయవాది నెవిల్లే మెక్కిన్లే (ఆర్.మాధవన్)ని రంగంలోకి దించుతాడు. తర్వాత ఏం జరిగింది? న్యాయం కోసం శంకరన్ ఎలాంటి పోరాటం చేశాడు? జనరల్ డ్వేయర్ కిరాతకాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడా? అనేది మిగతా కథ.
బ్రిటిష్ అహంకారం ఎంతటి కర్కశమైనదో చాటి చెప్పే సినిమా ఇది. జలియాన్‌వాలా బాగ్ మారణ హోమం ఇప్పటికీ మాయని గాయం. ఆ చోట బుల్లెట్టు తీసిన ప్రాణాలకు సంధించిన గాయాలు గోడలపై నెత్తుటి మరకల రూపంలో సజీవంగా వున్నాయి. ప్రజలు ప్రాణ భయంతో దూకిన బావి, నెత్తురు పారిన కాలువా వుంది. వేలమంది ప్రాణాలు కోల్పోయారు. అందులో మహిళలు, పసిపిల్లలు వున్నారు. ఇంత ఘోరకలికి పాల్పడిన బ్రిటిష్ సర్కార్.. ఇప్పటికీ ఈ మారణహోమం పై దేశానికి క్షమాపణలు చెప్పలేదంటే.. వారి అహంకారం ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. పైపెచ్చు అసలు ఈ ఘటననే చరిత్రలో లేకుండా చేయడానికి ప్రయత్నించి బ్రిటిష్ వైఖరిని తేటతెల్లం చేసిన ఈ సినిమా నిజంగా చాలా ముఖ్యమైన సినిమాగా చెప్పొచ్చు.
జలియన్‌వాలా బాగ్ మారణకాండని చిత్రీకరించిన తీరు మనసుని పట్టి కుదేపిస్తుంది. తర్వాత శంకరన్ నాయర్ పాత్రలో అక్షయ్ కుమార్ పరిచయం, లాయర్ గా అతని తెలివితేటలని చూపించే తీరు ఆకట్టుకునేలానే వుంటుంది. అయితే కథనం మళ్ళీ కోర్ట్ రూమ్ డ్రామాగా మారినంత వరకూ సన్నివేశాల్లో అంత జోరు కనిపించదు. ఎప్పుడైతే నెవిల్లే మెక్కిన్లే గా ఆర్.మాధవన్ కోర్ట్ లోకి ఎంట్రీ ఇస్తాడో అప్పటి నుంచి ఇరు పక్షాల వాదనలు రసవత్తరంగా మారుతుంది.
సెకండ్ హాఫ్ లో వాదనలు మరింత ఉత్కంఠతని పెంచేలా వుంటాయి. బార్ కౌన్సిల్ లో శంకరన్ వినిపించే వాదనలు క్లైమాక్స్ కి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. జనరల్ డ్వేయర్ బారతీయలు ముఖ్యంగా సిక్కుల పై ఇంతలా పగపట్టడానికి గల కారణాలు, అతనిలో ఉన్మాదం చూపించే తీరు, దాని కోసం శంకరన్ చేసిన గ్రౌండ్ ఒక థ్రిల్లర్ ని చూసిన అనుభూతిని పంచుతాయి.
అక్షయ్ కుమార్ శంకరన్ నాయర్ పాత్రలో ఒదిగిపోయాడు. నిజంగా తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇది. ఆర్. మాధవన్ నెవిల్లే మెక్ కిన్లీ హుందాగా చేశాడు. అక్షయ్ పాత్ర ముందు బలంగానే నిలబడ్డాడు. అనన్య పాండే డీసెంట్ రోల్ దొరికింది. తనవరకూ న్యాయం చేసింది. రెజీనాతో పాటు మిగతా నటీనటులు కథమేరకు కనిపించారు. కరణ్ సింగ్ త్యాగి చారిత్రక ఘటనను కోర్ట్ రూమ్ డ్రామాగా మార్చడంలో సఫలమయ్యాడు. దేబోజిత్ రే సినిమాటోగ్రఫీ 1919 కాలం వాతావరణాన్ని సజీవంగా చూపింది. బీజీఎం ఆకట్టుకునేలా వుంది. తెలుగు డబ్బింగ్ కూడా డీసెంట్ గా వుంది. బ్రిటిష్ అణిచివేతలు, చరిత్ర తెలుసుకోవాలనే ఆసక్తి వున్న ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది.