మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయం ఫైళ్ల దహనం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి అత్యంత సన్నిహితులు, ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ముని తుకారాం, మాధవరెడ్డి లను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ విదేశాల నుంచి తిరిగి వస్తుండగా తిరుపతి సమీపంలోని పనపాకం టోల్గేట్ వద్ద బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ నిందితులు అరెస్ట్ కాకుండా తప్పించుకోవడానికి గత కొన్నాళ్లుగా తీవ్ర ప్రయత్నాలు చేశారు. ముని తుకారాం ఈ ఘటన జరిగిన వెంటనే విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ నుంచే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, సుప్రీంకోర్టు ఈ కేసును అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ వారి బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. ప్రభుత్వ రికార్డుల దహనం వెనుక ఉన్న లోతైన కుట్రను తేల్చాల్సిందే అని కోర్టు ఆదేశించడంతో పోలీసులకు వారిని అరెస్ట్ చేసే మార్గం సుగమమైంది.
అరెస్ట్ అయిన ఇద్దరూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత నమ్మకస్తులు కావడంతో, ఇప్పుడు విచారణ మొత్తం ఆయన చుట్టూ తిరిగే అవకాశం ఉంది. పుంగనూరు, మదనపల్లె ప్రాంతాల్లో జరిగిన వేల కోట్ల విలువైన భూ అక్రమాలకు సంబంధించిన సాక్ష్యాలను తుడిచిపెట్టేందుకే ఈ ఫైళ్లను దహనం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే, ఈ కుట్ర వెనుక ఉన్న అదృశ్య హస్తం ఎవరిది? ఎవరి ఆదేశాల మేరకు ఈ ఫైళ్లకు నిప్పు పెట్టారు? అనే నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
దగ్ధమైన ఫైళ్లలో ఎక్కువగా 22-A , అసైన్డ్ భూములు, మ్యూటేషన్లకు సంబంధించిన కీలక పత్రాలు ఉన్నాయి. ఈ భూములను వైఎస్ఆర్సీపీ హయాంలో అక్రమంగా ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేశారనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం సీఐడీ అధికారులు ఈ కోణంలోనే దర్యాప్తును వేగవంతం చేశారు. ఒకవేళ నిందితులు విచారణలో నోరు విప్పితే, పెద్దిరెడ్డి కుటుంబానికి లేదా ఇతర కీలక నేతలకు ఈ కేసులో చిక్కులు తప్పవని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేవలం కింది స్థాయి అధికారులను మాత్రమే కాకుండా, అసలు సూత్రధారులను పట్టుకోవడమే లక్ష్యంగా సీఐడీకి పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఈ అరెస్టులతో కేసు తుది దశకు చేరుకుందని, త్వరలోనే మదనపల్లె భూ కుంభకోణంపై ఒక సమగ్ర నివేదికను పోలీసులు బహిర్గతం చేసే అవకాశం ఉంది.


