ప్రేక్షకులు, అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురుచూసిన రెండు భారీ సినిమాలు థియేటర్ లోకి వచ్చేశాయి. చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’, బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. ఈ రెండూ ప్రతిష్టాత్మక చిత్రాలే. చిరంజీవికి ఇది 150వ సినిమా అయితే, బాలయ్యకు ఇది వందో చిత్రం. ఒక రోజు గ్యాప్ లో వీరిద్దరు బాక్సాఫీసు బరిలో దిగారు. నిన్న (11) చిరంజీవి వస్తే.. ఈ రోజు బాలయ్య రంగంలోకి దిగిపోయారు. ఈ రెండు చిత్రాలపై అభిమానుల్లో భారీ అంచనాలు వున్న సంగతి తెలిసిందే. ఎంత కాదనుకున్నా ఫ్యాన్స్ మాత్రం ఈ సంక్రాంతి బాలయ్య, చిరుల మధ్య పోటీగానే ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడీ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద తలపడుతున్నాయి.
ఇప్పటికి తొలి రోజే కాబట్టి కలెక్షన్స్ మాట కాస్త పక్కన పెట్టి రిలీజ్ తర్వాత ఈ చిత్రాలపై అభిమానులు, ప్రేక్షకులు, సోషల్ మీడియాలో నడుస్తున్న ట్రెండ్ గమనిస్తే కాస్త ఆసక్తికరమైన అభిప్రాయం వ్యక్తమౌతుంది. చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’ సినిమా విషయానికి వస్తే.. ఇక్కడ చిరంజీవి ఒక్కరే స్పెషల్ ఎట్రాక్షన్. ఈ సినిమా కధను అరువు తెచ్చుకున్నారనే విమర్శ మొదటి నుండి వుంది. సో కధ ముందే తెలుసు కాబట్టి ఇక మిగిలిన ఎట్రాక్షన్ చిరంజీవి, ఆయన రీఎంట్రీ మాత్రమే. సినిమా చూసిన తర్వాత మెగాస్టార్ ని చూడడానికే సినిమాకి వెళ్ళాలి అనే టాక్ కూడా వచ్చింది. ఇక కలెక్షన్ విషయానికి వస్తే తొలి రోజు అంచనాలకు తగ్గట్టే రాణించింది ఖైదీ. మొత్తంమ్మీద ఈ సినిమాతో తన అభిమానులను ఖుషి చేశారు చిరు.
ఇక ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ విషయానికి వస్తే చాలా పాజిటీవ్ వైబ్రేషన్స్ వున్నాయి. తెలుగుజాతి ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి జీవితం ఆదరంగా ఈ సినిమా తీశారు. ఇది తెలుగు వారి సినిమా అని చాటి చెప్పారు. ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన చరిత్రగా ప్రచారం చేశారు. ఇది బాగా వర్క్ అవుట్ అయ్యింది. బాహుబలికి కూడా ఇదే జరిగింది. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా బాహుబలి అనే మాట ప్రేక్షకుల నుండే వచ్చింది. ఇప్పుడు గౌతమీ పుత్ర విషయంలో ఈ మేనియా కనబడుతుంది. పేస్ బుక్, ట్విట్టర్ వేదికగా ప్రేక్షకులు, అభిమానులు, సెలబ్రిటీలు.. ఇది తెలుగు వారందరూ చూడాల్సిన సినిమా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది బాలయ్య సినిమాకి బిగ్ ప్లస్ అని చెప్పాలి. మొత్తంమ్మీద ప్రతిష్టాత్మక చిత్రానికి కధ ఎంపిక విషయంలో బాలయ్యే పై చేయి సాధించారనే అభిప్రాయం వ్యక్తమౌతుందిప్పుడు.