తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం ఖమ్మం. ఇక్కడ నుంచి ప్రజాకూటమి అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు, టీఆర్ఎస్ అభ్యర్థిగా పువ్వాడ అజయ్ హోరాహోరీగా పోరాడుతున్నారు. ఆర్థికంగా బలవంతులైన ఈ ఇద్దరూ… వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకుని ఎన్నికల సమరానని కొనసాగిస్తున్నారు. టీఆర్ఎస్ తరపున బరిలో ఉన్న అజయ్ కుమార్ గెలుపు బాధ్యతలను తుమ్మల నాగేశ్వర రావుకు అప్పగించారు కేసీఆర్. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. ఇదే పువ్వాడ అజయ్ చేతిలో తుమ్మల ఓడిపోయారు. ఇప్పుడు.. అదే అజయ్ గెలుపు బాధ్యతను తీసుకోవాల్సి వచ్చింది.
తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేస్తున్న 13 నియోజకవర్గాల్లో గట్టిగా గెలుపుపై నమ్మకం పెట్టుకున్న స్థానాల్లో ఖమ్మం ఒకటి. నిజానికి అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వరకూ.. ఖమ్మంలో టీడీపీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. నామా నాగేశ్వరరావు పార్లమెంట్‌కే పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ… పువ్వాడ అజయ్‌కు నామా నాగేశ్వరరావు మాత్రమే గట్టి పోటీ ఇవ్వగలరన్న ఉద్దేశంతో.. ఖమ్మం సీటును పొత్తుల్లో భాగంగా తీసుకుని నామా నాగేశ్వరరావు నిలబెట్టారు. అప్పటి వరకూ… పువ్వాడ అజయ్‌కు పోటీ లేదని భావించిన వారు.. నామా నాగేశ్వరరావు అభ్యర్థి అయ్యే సరికి అభిప్రాయాన్ని మార్చుకున్నారు. వెంటనే… నామా తన రాజకీయ వ్యూహాన్ని అమలు చేశారు. టీఆర్ఎస్లోకి వెళ్లిన వారందర్నీ మెల్లగా సొంత పార్టీలోకి చేర్చుకోవడం ప్రారంభించారు. కొంత మంది టీఆర్ఎస్ బలమైన నేతలూ పార్టీలో చేరడం నామాకు అదనపు బలాన్నిచ్చింది. టీఆర్ఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు బుడాన్‌బేగ్ తో పాటు.. మరికొంత మంది కార్పొరేటర్లు కూడా… టీడీపీలో చేరారు.
2009 పార్లమెంటు ఎన్నికల్లో నామా నాగేశ్వరరావుపై ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి రేణుకాచౌదరి రంగంలోకి దిగి మద్దతు ప్రకటించారు. టీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ గత ఎన్నికల ముందు.. టీఆర్ఎస్లో చేరుతారని ప్రచారం జరిగింది. 2014 ఎన్నికలకు ముందు ఓ మీడియా సమావేశంలో.. పువ్వాడ అజయ్.. కేటీఆర్‌కు మంచి మిత్రుడని.. త్వరలో ఆయన పార్టీలోకి వస్తారని.. ఖమ్మం పార్లమెంట్ స్థానానికి ఆయన పోటీ చేస్తారని కేసీఆర్ చెప్పారు. కానీ అజయ్ మాత్రం ఖండించారు. కాంగ్రెస్ తరపున అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. కొన్నాళ్లు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కానీ.. మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత మనసు మార్చుకుని టీఆర్ఎస్లో చేరిపోయారు.
ఖమ్మం నియోజకవర్గంలో మొత్తం 2.58,440 మంది లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,15,000 లక్షల ఓటర్లు పట్టణ ప్రాంతంలోనే ఉన్నారు. మైనారిటీలు 38 వేలు, కమ్మలు 45 వేలు ఉన్నారు. వీరే ప్రధానంగా గెలుపోటముల్ని నిర్దేశించనున్నారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అజయ్ కు 70,465 ఓట్లు సాధించారు. టీడీపీ నుంచి పోటీ చేసిన తుమ్మల నాగేశ్వర రావుకు 64,783 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థిగా 14,065, వైసీపీ అభ్యర్థికి 25,032 ఓట్లు పోలయ్యాయి. ఈ సారి టీడీపీ, కాంగ్రెస్ కలసి పోటీ చేస్తున్నాయి. వైసీపీ పోటీలో లేదు.