మెడికల్ కాలేజీలను పీపీపీకి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో కనీసం ఒక్క కాలేజీకి అయినా టెండర్ వచ్చిందని అనుకున్నారు. ఆదోని మెడికల్ కాలేజీకి కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం టెండర్ వేసిందన్న ప్రచారం జరిగింది. టెండర్లు తెరిచిన తర్వాత మూడు రోజుల పాటు ఈ ప్రచారం జరిగిన తర్వాత తాజాగా కిమ్స్ స్పందించింది. తాము ఎలాంటి టెండర్ వేయలేదని చెప్పింది. దీంతో గందరగోళం ఏర్పడింది. చివరికి తేలిందేమిటంటే.. కిమ్స్ కాకుండా.. అందులో పని చేసే డాక్టర్ ప్రేమ్ చంద్ షా అనే వ్యక్తి టెండర్ వేశారు. అందుకే అది కిమ్స్ టెండర్ గా ప్రచారంలోకి వచ్చింది.
ఆదోని కాలేజీకి కిమ్స్ నుంచి టెండర్ వచ్చిందని అధికారులు చెప్పడంతో చంద్రబాబు కూడా వెంటనే ఒప్పందం చేసుకుని పనులు ప్రారంభించేలా చేయాలని అధికారులకు సూచించారు. తీరా చూస్తే.. కిమ్స్ యూటరన్ తీసుకుంది. ఈ విషయాన్ని సత్యకుమార్ కూడా అంగీకరించారు. డాక్టర్ ప్రేమ్ చంద్ షా అనే వ్యక్తి పేరు మీద టెండర్ వచ్చింది.. కిమ్స్ ఆసుపత్రిలో ప్రేమ్ చంద్ డాక్టర్ గా ఉన్నారు.. అందుకే కిమ్స్ పేరు మీద టెండర్ వచ్చిందన్నారు. కిమ్స్ టెండర్ అనేది చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రమేనని.. కిమ్స్ మెడికల్ కాలేజీ కోసం ఎలాంటి బిడ్ వేయలేదని చెప్పుకొచ్చారు.
ఇతర కాలేజీలకు టెండర్లు రాకపోవడంతో ప్రభుత్వం కొన్ని మినహాయిపులు ఇచ్చేందుకు సిద్ధమయింది. ఈ క్రమంలో కిమ్స్ కూడా రివర్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ పీపీపీ విధానంలో కేంద్రం కూడా సాయం చేసేందుకు ముందుకు వస్తోంది. అందుకే మరిన్ని మినహాయింపులతో త్వరలో కొత్త టెండర్లు పిలిచే అవకాశం ఉంది. ఈ సారి బడా సంస్థలు రేసులోకి రాకపోతే.. మెడికల్ కాలేజీల నిర్మాణం ఆలస్యమయ్యే ప్రమాదం ఏర్పడుతుంది.
