ఈనెల 24న ‘హరి హర వీరమల్లు’ రాబోతోంది. 2025 సెకండాఫ్‌లో వచ్చే మొదటి భారీ సినిమా. ఇండస్ట్రీకి చాలా కీలకమైన మూవీ. ఈ సినిమా హిట్టయితే బాక్సాఫీసు కళకళలాడుతుంది. చిత్రసీమకు విజయాల కరువు తీరుతుంది. ట్రైలర్ బాగా కట్ చేయడంతో సినిమాపై నమ్మకాలు పెరిగాయి. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర పండగ చేయడానికి రెడీగా ఉన్నారు. అయితే వీరమల్లుకు ‘కింగ్ డమ్’తో చిక్కు వచ్చి పడింది. ‘వీరమల్లు’ విడుదలైన సరిగ్గా వారానికి ‘కింగ్ డమ్’ విడుదల అవుతోంది. పవన్ కల్యాణ్‌కి వారం రోజుల వ్యవధి సరిపోతుందా? అనేదే పెద్ద ప్రశ్న.
పవన్ కల్యాణ్ స్టార్ హీరో. ఇలాంటి హీరో సినిమా వస్తోందంటే కనీసం రెండు వారాల వ్యవధి అవసరం. కానీ ‘వీరమల్లు’కు ఆ ఛాన్స్ లేకుండా పోయింది. సినిమాకు పాజిటీవ్ టాక్ వచ్చి, బాక్సాఫీసు దగ్గర నిలబడితే – రెండో వారంలో కూడా కలక్షన్లు రాబట్టుకోవొచ్చు. థియేటర్లకు ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చేది రెండో వారంలోనే. కానీ… ‘వీరమల్లు’కు ఆ ఛాన్స్ ఉండదు. వెంటనే ‘కింగ్ డమ్’ వచ్చి పడిపోతుంది.
బడా సినిమాలన్నీ మూడు రోజుల వసూళ్లతోనే సంతృప్తి పడిపోతున్నాయి. కాకపోతే.. వీరమల్లు బడ్జెట్ వేరు. బిజినెస్ వేరు. నిర్మాత ఈ సినిమాకు భారీ రేట్లు చెబుతున్నారు. అంత రిస్క్ చేసి సినిమా కొన్న బయ్యర్లకు ఆ డబ్బులు రావాలంటే, బ్రేక్ ఈవెన్ లో పడాలంటే రెండో వారం కూడా స్పేస్ కావాలి. అది లేకపోతే.. అంత రిస్క్ పెట్టి పెద్ద సినిమాలు కొనలేరు. ‘వీరమల్లు’ బిజినెస్ దాదాపు క్లోజింగ్ స్టేజ్‌కి వచ్చింది. అగ్రిమెంట్లు జరగలేదు కానీ, ఓ రేటు అనుకొని, దానికి ఫిక్స్ అవ్వడానికి బయ్యర్లు రెడీగా ఉన్నారు. కానీ ‘కింగ్ డమ్’ డేట్ ప్రకటించడంతో ఇప్పుడు డైలామాలో పడే అవకాశం ఉంది. పవన్ కంటే విజయ్ దేవరకొండ చిన్న హీరో కావొచ్చు. కానీ ‘కింగ్ డమ్’ కి కూడా క్రేజ్ ఏర్పడింది. ఈరోజు విడుదల చేసిన గ్లింప్స్ తో అది మరింత పెరుగుతుంది. కాబట్టి ‘కింగ్ డమ్’ వస్తే – ప్రేక్షకుల చూపంతా ఆ సినిమాపైనే ఉంటుంది.
మొత్తానికి ‘వీరమల్లు’ స్పీడుకు ‘కింగ్ డమ్’ బ్రేకులు వేసినట్టే అనిపిస్తోంది. పవన్ సినిమా ప్రభంజనంలా ఉంటే.. ఏ సినిమా దాన్ని అడ్డుకోలేదని అభిమానులు అనుకొంటుంటారు. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి.