విజయ్ దేవరకొండ ‘కింగ్ డమ్’ రిలీజ్ డేట్ ఖరారైంది. గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. భాగశ్రీ బోర్సే కథానాయిక. జులై 4న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని చిత్రబృందం ప్రకటించింది. ఈ సీజన్ రాబోతున్న క్రేజీ సినిమాల్లో ఇదొకటి. కాకపోతే ‘కింగ్ డమ్’ వల్ల నితిన్ ‘తమ్ముడు’ వెనక్కి వెళ్లాల్సివచ్చింది. ‘తమ్ముడు’ సినిమానీ జులై 4నే విడుదల చేద్దామనుకొన్నారు. చిత్రబృందం కూడా అధికారికంగా రిలీజ్ డేట్ ప్రకటించింది. ఓ గ్లింప్స్ కూడా బయటకు వదిలింది. తీరా చూస్తే ఇప్పుడు అదే డేట్ ని ‘కింగ్ డమ్’ ఆక్రమించుకొంది. దాంతో `తమ్ముడు` మరోసారి వాయిదా పడక తప్పడం లేదు.
దిల్ రాజు – నాగవంశీ ఇద్దరి మధ్య కొన్ని రోజులుగా చర్చలు నడుస్తున్నాయి. జులై 4వ తేదీ ని ముందుగానే దిల్ రాజు లాక్ చేశారు. ఇప్పుడు నాగవంశీ అదే డేట్ కోరుకొంటున్నారు. దాంతో దిల్ రాజుతో సంప్రదింపులు తప్పలేదు. ‘తమ్ముడు’తో పోలిస్తే ‘కింగ్ డమ్’ భారీ బడ్జెట్ సినిమా. క్రేజ్ పరంగానూ ముందే ఉంది. కాబట్టి ‘కింగ్ డమ్’ తో పోటీ వద్దనుకొన్నారు దిల్ రాజు. కాబట్టే తగ్గారు. ఇప్పుడు ‘తమ్ముడు’కి కొత్త డేట్ కావాలి. `కింగ్ డమ్` విడుదలైన రెండు వారాల తరవాత ‘తమ్ముడు’ సినిమాని విడుదల చేసే అవకాశం ఉంది. వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకుడు. వర్ష బొల్లమ్మ కథానాయికగా నటించింది. నిజానికి ‘రాబిన్ వుడ్’ కంటే ఈ సినిమా ముందు విడుదల కావాల్సివుంది. ప్రతీసారీ ఏదో ఒక కారణంతో వెనక్కి వెళ్తోంది. ఈసారి విజయ్ దేవరకొండ అడ్డు పడ్డాడు.