బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన కెరీర్లో తొలిసారి చేసిన హారర్ సినిమా ‘కిష్కింధపురి’. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. ‘చావు కబురు చల్లగా’ ఫేమ్ కౌశిక్ దర్శకత్వం వహించారు. ఈ నెల 12న విడుదల అవుతోంది. ఈరోజు ట్రైలర్ వదిలారు.
”ఊరికి ఉత్తరాన
దారికి దక్షిణాన
పశ్చిమ దిక్కున ప్రేతాత్మలన్నీ
పేరు వినగానే తూర్పుకు తిరిగే ప్రదేశం” అనే డైలాగులతో ఈ కిష్కింధపురిని పరిచయం చేశారు. సాధారణంగా హారర్ సినిమాలు ఏ టెంప్లెట్ లో ఉంటాయో.. ఈ సినిమా కూడా అలాంటి టెంప్లెట్ లోనే మొదలైంది. కాకపోతే.. క్రమంగా… ఓ కొత్త కోణంలోకి వెళ్లినట్టు అనిపించింది.
ఓ దెయ్యాల కోట. దెయ్యాలపై ఆసక్తి ఉన్నవాళ్లు, దెయ్యాల గురించి తెలుసుకోవాలనుకొంటున్నవాళ్లని ఆ కోటలోకి తీసుకొస్తారు. అక్కడ్నుంచి వాళ్ల ప్రయాణం ఎలా ఉండబోతోంది అనేదే కథ. విజువల్స్, సౌండ్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. హారర్ కథకు మించినదేదో ఈ సినిమాలో ఉంటుందన్న భరోసా ఏర్పడింది.
”బ్రతుకు మీద ఇంత తీపి ఉన్నవాళ్లు బ్రతకడానికి అర్హులే కారు”
”సామాన్యుడిగా పుట్టినా ముల్లోకాలకీ ఎదగ్గలిగిన త్రివిక్రముడి బలం.. తనపై తనకున్న నమ్మకం” లాంటి డైలాగులు ఈ సినిమాలోని కంటెంట్ ఏమిటో పరోక్షంగా చెబుతాయి.
”ఈ పాటని కోరిన శ్రోతలు…” అనగానే చివర్లో అనుపమ పరమేశ్వరన్ ని చూపించిన విధానం ఈ ట్రైలర్ కే హైలెట్. అనుపమతోనూ భయపెట్టే ప్రయత్నం చేశారన్న విషయం అర్థం అవుతోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈమధ్య పెర్ఫార్మెన్స్ పై దృష్టి పెట్టాడు. తన నటన కూడా కొత్తగా అనిపించే అవకాశం ఉంది. టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉన్న సినిమా ఇది. కంటెంట్ కూడా అదిరితే… థియేటర్లో ప్రేక్షకులూ భయపడడం ఖాయం.