జూబ్లిహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరుగులేని విజయం సాధిస్తుందని సర్వే వదిలారు కేకే. ఏడు డివిజన్లలో ఐదు డివిజన్లలో ఆరవై శాతానికిపైగా ఓట్లు బీఆర్ఎస్కు వస్తాయని తేల్చారు. మిగతా రెండు డివిజన్లలోనూ బీఆర్ఎస్ కే ఆధిక్యం వస్తుందన్నారు. తర్వాత ఎగ్జిట్ పోల్స్ కూడా అంతే ప్రకటించారు.
కేకే గతంలో హరీష్ రావు ఇంట్లో ఉండగా మీడియా కంట పడ్డారు. బీఆర్ఎస్ పార్టీ.. కేకేతో ఒప్పందం చేసుకున్నారని అప్పట్లోనే ప్రచారం జరిగింది. ఇప్పుడు అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేని విజయం వస్తుందని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కొంత ఖచ్చితమైన ఫలితాలతో కేకే .. రాజకీయవర్గాల్లో కొంత నమ్మకాన్ని పెంచుకున్నారు. కానీ ఆయన బీఆర్ఎస్ తో డీల్ చేసుకుని మొత్తం ఆ నమ్మకాన్ని అమ్మేసుకున్నారు.
జూబ్లిహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవడానికి ఒక్క సమీకరణం కూడా అనుకూలంగా లేదని సామాన్య రాజకీయ విశ్లేషకుడు కూడా అంచనా వేస్తాడు. అభ్యర్థి నవీన్ యాదవ్ కావడం, మజ్లిస్ సపోర్టు చేయడం, బీఆర్ఎస్ క్యాడర్ చాలా వరకూ పార్టీ మారడం మాత్రమే కాదు.. గోపీనాథ్ పై బీఆర్ఎస్ క్యాడర్ లోనే అసంతృప్తి ఉంది. ఆయన మరణించినా ఆయన భార్య కోసం పని చేసేందుకు వారు సిద్ధపడలేదు. ఇవన్నీ అంచనా వేసిన ఎవరూ బీఆర్ఎస్ గెలుస్తుందని అనుకోలేదు.
కానీ కేకే మాత్రం లాటరీ వేశారు. ఇప్పుడు ఆయన విశ్వసనీయత అంతా గంగలో కలిసిపోయింది. ఇక ఆయన చెప్పే సర్వేలకు విలువ ఉండదు. అచ్చంగా ఆరా మస్తాన్ లాగే ఆయన కూడా పూర్తిగా .. తన నమ్మకాన్ని రాజకీయ పార్టీలకు అమ్ముకుని .. విశ్వసనీయత లేని సర్వేయర్లుగా మిగిలిపోయారు.


