వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ వ్యవహారాలు, ఆస్తుల పంపకాలపై మాజీ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. గుడివాడలో పర్యటించడం ప్రారంభించిన ఆయన జొన్నపాడులో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అది రాజకీయ కార్యక్రమం కాదు. ఓ వైసీపీ నేత ఇంట్లో దశదినకర్మకు వెళ్లికి జగన్ గురించి చెప్పుకొచ్చారు. జగన్ తన సొంత ఆస్తిలో సోదరీమణులకు వాటా ఇచ్చారని, ఆయన సంస్కారవంతుడని సర్టిఫికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు.
కొడాలి నాని వంటి నేతలు జగన్ మోహన్ రెడ్డిని ఒక ఆదర్శ సోదరుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. జగన్ తన సోదరీమణులపై నేరుగా విమర్శలు చేయకపోయినా, తన అనుచరులు , సోషల్ మీడియా సైన్యంతో వారిపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. వైఎస్ షర్మిల, వైఎస్ సునీతలను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ప్రచారం వెనుక తెర వెనుక సూత్రధారి ఎవరో అందరికీ తెలుసు.
సొంత తల్లి విజయమ్మను సైతం వదలకుండా ఆమెపై చంద్రబాబు కోవర్టు అనే ముద్ర వేశారు. సాక్షి పత్రికలో పేజీలకు పేజీలు తల్లికి వ్యతిరేకంగా కథనాలు రాయించడం, ఆమెను రాజకీయ ప్రత్యర్థుల ఏజెంట్గా చిత్రించడం వెనుక ఉన్నది జగన్ రెడ్డి కాదని ఎవరైనా అంటారా..? రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వంటి నేతలతో షర్మిలపై దారుణమైన వ్యాఖ్యలు చేయించి, ఆ తర్వాత ఏమీ తెలియనట్టు మౌనం వహించడం జగన్ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని విమర్శలు వస్తున్నాయి.
జగన్ వ్యక్తిత్వం గురించి కొడాలి నాని వంటి వారు ఇచ్చే సర్టిఫికెట్లు ప్రజల్లో నవ్వులాటగా మారుతున్నాయి. నోటి దురుసుతనానికి మారుపేరుగా నిలిచే నాని, జగన్ సంస్కారం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆడపడుచులను గౌరవించే వ్యక్తి అయితే, తన సోదరి షర్మిల రోడ్డు మీద నిలబడి న్యాయం కోసం ఎందుకు పోరాడాల్సి వస్తోంది? సునీత తన తండ్రి హంతకుల కోసం ఏళ్ల తరబడి ఎందుకు తిరుగుతోంది? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
