తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ కోదండరామ్ పాత్ర చాలా కీలకమైంది. అయితే, రాష్ట్రం ఏర్పడ్డ తరువాత ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు నిరాకరించారు. ప్రజల పక్షానే ఉంటూ పోరాటాలు చేస్తా అంటూ నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గట్టుగానే కేసీఆర్ సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ వస్తున్నారు. అయితే, కోదండరామ్ ఎన్ని విమర్శలు చేసినా కూడా ఇన్నాళ్లూ కేసీఆర్ సర్కారు ఆయన విషయంలో ఓ సాఫ్ట్ కార్నర్‌తో వ్యవహరిస్తూ వచ్చేది. కానీ, ఇప్పుడు ఆయనపై కూడా తెరాస దుమ్మెత్తి పోస్తోంది. ఇతర రాజకీయ పార్టీల నాయకులను విమర్శించిన విధంగానే కోదండరామ్‌పై కూడా తెరాస నాయకులు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో వినిపిస్తున్న కొన్ని ఆరోపణలపై కోదండరామ్ వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకుంటోందని చెప్పాలి.
కోదండరామ్ కాంగ్రెస్ ఏజెంటుగా మారిపోయారంటూ తెరాస ఎంపీ బాల్క సమన్ విమర్శించారు. మేధావి ముసుగులో రాజకీయాలు చేస్తున్నారంటూ ఆయన ఆరోపిస్తున్నారు. జేయేసీ ముసుగులో కాంగ్రెస్‌కు అనుకూలంగా పనిచేస్తున్నారనీ, తెలంగాణలో చతికిలపడిన ఆ పార్టీ పునర్జీవానికి పాటుపడుతున్నారని సుమన్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలపై ఆయన విమర్శలు చేస్తున్నారనీ, ఇదంతా కాంగ్రెస్ కోసం సాగిస్తున్న రాజకీయంగా సుమన్ అభివర్ణించారు. ఉద్యమకారుడి ముసుగులో ప్రజలను రెచ్చగొడుతూ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచుతున్నారనీ, మల్లసాగర్ నిర్వాసితులకు లేనిపోని భయాలు నూరిపోస్తున్నారని మండిపడ్డారు. అయితే, ఈ క్రమంలో ఓ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు సుమన్. జులై 16, 17 తేదీల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో కోదండరామ్ భేటీ అయ్యారనీ, రహస్యంగా కొన్ని విషయాలపై ఆ ఇద్దరూ చర్చలు జరిపారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో కత్తి వెంకటస్వామి, అద్దంకి దయాకర్‌లకు కాంగ్రెస్ టిక్కెట్టు ఇప్పించింది ఆయనేననీ.. ఇది నిజమో కాదో ఆయన్నే చెప్పమనండి అంటూ సుమన్ ప్రశ్నించారు. అంతేకాదు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో కూడా కోదండరామ్ రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటున్నారని చెప్పారు.
ఈ ఆరోపణలపై కోదండరామ్ స్పందించాల్సిన అవసరం ఏర్పడింది. సోనియాతో భేటీ గురించి వివరణ ఇవ్వాలి. అలాగే, రాష్ట్ర కాంగ్రెస్‌నేతలతో టచ్‌లో ఉండటంపై కూడా స్పందించాలి. పదవులపై వ్యామోహం లేదంటూనే కోదండరామ్ తెర వెనక చేస్తున్న రాజకీయం ఇదీ అంటూ తెరాస మండిపడుతోంది. తనపనేదో తాను చూసుకుంటున్నారు అనుకున్న కోదండరామ్‌ను దాదాపు రాజకీయాల్లోకి తెరాస లాగేసినట్టే..! ఈ ఆరోపణలపై స్పందించకపోతే తెరాస చెప్పిందే నిజమేమో అని ప్రజలు అనుకునే అవకాశం ఉంది కదా!