కోకాపేటను రియల్ ఎస్టేట్ సంస్థలు గోల్డ్ మైన్ గా చూస్తున్నాయి. అందుకే అక్కడ తమ పెట్టుబడుల్ని కుమ్మరిస్తున్నాయి. పైగా పూర్తి స్థాయిలో లగ్జరీ ప్రాజెక్టుల్నే నిర్మిస్తున్నారు. మధ్యతరగతికి అందుబాటులో ఉండటం లేదు. ఫలితంగా సేల్ కాని యూనిట్లు పెరిగిపోతున్నాయి.
ఇతర చోట్లా చదరపు అడుగుకు ఐదు వేల నుంచి ఆరు వేల వరకు ధరలు ఉన్నాయి. కానీ కోకాపేటలో అపార్ట్మెంట్ల సగటు ధర చదరపు అడుగుకు రూ. 9 వేల నుండి రూ. 14వేల వరకూ ఉన్నాయి. 2 BHK అపార్ట్మెంట్ సగటు ధర 9౦ లక్షలుపైనే ఉంటుంది. అన్ని అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీలలో ఉంటాయి, ఇవి స్విమ్మింగ్ పూల్, జిమ్, ల్యాండ్‌స్కేప్ గార్డెన్స్, 24/7 సెక్యూరిటీ, పార్కింగ్ సౌకర్యాలను కలిగి ఉంటాయి. దాదాపుగా ఇప్పుడు కొత్తగా నిర్మాణం అయినవి కాకుండా.. రెండేళ్ల కిందట ప్రారంభించినవి.. చాలా వరకూ పూర్తవుతున్నాయి. కొన్ని ప్రాజెక్టులు రెడీ-టు-మూవ్ గా అందుబాటులో ఉన్నాయి.
కోకాపేటలో ఇప్పటికిప్పుడు కనీసం వెయ్యికిపైగా అపార్ట్మెంట్లు అమ్మకానికి ఉన్నాయని మార్గెట్ వర్గాలు చెబుతున్నాయి. బడా సంస్థల ప్రాజెక్టుల్లోనూ కొంత వరకూ అమ్మకాలు జరగడం లేదు. ఓ ప్రముఖ సంస్థ నిర్మించిన హై రైజ్ అపార్టుమెంట్ లో సగానికిపైగా సేల్ కాలేదు. దాంతో ఆ సంస్థ లిక్విడిటీ సమస్యలు ఎదుర్కొంటోందని చెబుతున్నారు. ఇంకా చాలా సంస్థలు ఇప్పుడిప్పుడే నిర్మాణాలు ప్రారంభిస్తున్నాయి. దీంతో ఓవర్ ఫ్లో మరింత పెరగనుంది. డిమాండ్ కన్నా డబుల్ .. లగ్జరీ ఇళ్లు కోకాపేటలో రెడీ అవుతున్నాయి.