హైదరాబాద్ రియాల్టీలోకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు చెందిన కంపెనీ అడుగు పెట్టబోతోంది. కోకాపేటలో అత్యంత విలాసవంతమైన టవర్స్ ను నిర్మించడానికి ప్రణాళికలు వేశారు. అనుమతుల ప్రక్రియ చివరిలో ఉందని ప్రచారం జరిగింది. ఇందు కోసం ట్రంప్ రియాల్టీ తన భారతీయ భాగస్వామిగా ఐరా రియాలిటీని ఎంచుకుంది. కోకాపేటలో ఐరా రియాలిటీకి చెందిన స్థలంలో నిర్మాణాలు చేయబోతున్నట్లుగా చెబుతున్నారు.
కానీ ఇప్పుడు ఆ స్థలం వివాదంలో పడింది. ఆ స్థల సహ యజమానుల్లో తాను కూడా ఒకరినని కానీ తనకు తెలియుకండా ఈ ట్రంప్ టవర్స్ ప్రకటనలు వస్తున్నాయని.. దీన్ని ఊరుకునేది లేదని నాందెల రామ్ రెడ్డి అనే వ్యక్తి బహిరంగ లీగల్ నోటీసు ఇచ్చారు. గోల్డెన్ మైల్ ప్రాంతంలో ట్రంప్ టవర్స్ నిర్మించాలనుకుంటున్న స్థలంలో తన క్లయింట్ కూడా సహ యజమాని అని ఆయనకు అక్కడ 425 గజాల మేర ల్యాండ్ షేర్ ఉందని రాంరెడ్డి తరపు లాయర్ పత్రికా ప్రకటన ఇచ్చారు. అయితే తన క్లయింట్ కు తెలియకుండానే ట్రంప్ టవర్స్ నిర్మిస్తున్నారని తెలిసిందన్నారు.
మొత్తం 12, 602 గజాల స్థలాన్ని ఐరా కంపెనీతోపాటు మరో పది మందికిపైగా వ్యక్తులు కలిసి కనుగోలు చేశారు. అందులో రాంరెడ్డి ఒకరు. ఆయన వాటాగా 425గజాలు ఉంది. అయితే ఆయనకు తెలియకుండానే ఆ స్థలంలో ట్రంప్ టవర్స్ ప్రపోజ్ చేశారు. దీంతో సమస్య వచ్చింది. ఆయన లీగల్ నోటీసులు ఇచ్చారు. ఇలాంటి వివాదాలు వస్తే ట్రంప్ రియాలిటీ ముందుకు వెళ్లే అవకాశం ఉండని భావిస్తున్నారు. ఈ వివాదం సమసిపోకపోతే.. ట్రంప్ టవర్స్ మరోసారి వెనక్కి తగ్గే అవకాశం ఉంది.