కొలికపూడి శ్రీనివాసరావు.. సివిల్స్ కు ప్రిపేర్ అయ్యే వారికి పాఠాలు చెప్పే మాస్టారు. ఆయన దగ్గర కోచింగ్ తీసుకుని ఐఏఎస్ సాధించిన వారు కూడా ఉన్నారు. ఆయనకు రాజకీయం పాఠాలుగా చెప్పడం వచ్చు..కానీ నేరుగా రాజకీయం చేయడం మాత్రం రాదని ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయిన ఏడాదిలో తేలిపోయింది. ప్రతి సారి తేల్చుకుంటూనే ఉన్నారు.
ఎయిర్ పోర్టు ఎదుట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో షేక్ హ్యాండ్ ఇస్తున్న ఓ పది సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పెద్దిరెడ్డితో కొలికపూడి భేటీ అంటూ ప్రచారం చేశారు. తిరువూరులో సమస్యలు ఉన్నాయని అందుకే ఆయన పార్టీ మారేందుకు భేటీ అయ్యారని ప్రచారం చేశారు. కాసేపటికే ఓ ఎస్ఐ పై ఆయన ఆరోపణలు చేస్తున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ రెండు వీడియోలు వైరల్ అయ్యాయి.
దాంతో కొలికపూడి మీడియా సమావేశం పెట్టుకుని వివరణ ఇచ్చారు. పెద్దిరెడ్డిని తాను రాజమండ్రి ఎయిర్ పోర్టులో కలవలేదని.. వైరల్ అవుతున్న వీడియో కూడా 19వ తేదీ తిరుపతి ఎయిర్ పోర్టులోదన్నారు. విమానంలో తిరుపతికి వెళ్తే పెద్దిరెడ్డి కనిపిస్తే బాగున్నారా అని అడిగానన్నారు. అదంతా ఎనిమిది సెకన్లలోనే జరిగిందని వివరణ ఇచ్చారు. తిరుపతిలో ఉండగానే సీఎంవో నుంచి పిలుపు వచ్చిందని..నేరుగా వెళ్లి చంద్రబాబుతో 40 నిమిషాలు సమావేశమయ్యాన్నారు. తన పనితీరుపై చంద్రబాబు రిపోర్టు ఇచ్చారన్నారు.
బొత్స , అయ్యన్న ఆలింగనం చేసుకున్నారని అయినా ఎవరూ మాట్లాడలేదని తనపై మాత్రం ప్రచారం చేస్తున్నారని కొలికపూడి అంటున్నారు. ఆయన మాటల్లోనే సమస్య ఏమిటో .. పరిష్కారం ఏమిటో ఉంది. కొలికపూడి నేర్చుకోవాల్సిన రాజకీయం రాసి పెట్టి ఉంది. పార్టీపై ఎంత విధేయత చూపిస్తే.. అంత తక్కువ ప్రచారం జరుగుతుంది. ప్రతి దానికి వివాదాల్లో ఉంటే.. ఇలాంటి ప్రచారాలే జరుగుతాయి. ముందు కొలికపూడి.. ఈ రాజకీయం గురించి తెలుసుకోవాల్సి ఉంది. లేకపోతే రాజకీయం నేర్పే మాస్టారుకు.. రాజకీయం చేయడం చేతకాక ఫెయిలయినట్లు అవుతుంది.