హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చుకోవడానికి బాచుపల్లి , కొల్లూరు ప్రాంతాలు ఇప్పుడు ప్రధాన ఎంపికలుగా మారాయి. నగరంలోని ఐటీ కారిడార్‌కు చేరువలో ఉండటం, రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో ఈ ప్రాంతాలు హాట్ స్పాట్లు గా అవతరించాయి. ముఖ్యంగా గచ్చిబౌలి, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో, సామాన్యులకు అందుబాటులో ఉన్న ధరలే ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పరుగులు పెట్టిస్తున్నాయి.
ప్రస్తుతం బాచుపల్లి , కొల్లూరు పరిసరాల్లో చదరపు అడుగు ధర రూ. 6,300 నుంచి రూ. 6,650 మధ్య కొనసాగుతోంది. వెస్ట్ హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇది అత్యంత సరసమైన ధరగా రియల్ ఎస్టేట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు తొలిసారి ఇల్లు కొనాలనుకునే వారు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి అమితాసక్తి చూపుతున్నారు. బడ్జెట్ ధరలోనే అత్యాధునిక వసతులతో కూడిన గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లు అందుబాటులోకి రావడం వీరికి కలిసొచ్చే అంశం.
బాచుపల్లి ప్రాంతం అటు నిజాంపేట, ఇటు మియాపూర్ మెట్రో స్టేషన్లకు దగ్గరగా ఉండటం ఒక ఎత్తయితే, కొల్లూరు ప్రాంతం ఔటర్ రింగ్ రోడ్ కు ఆనుకుని ఉండటం మరో ప్రధాన ఆకర్షణ. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు కేవలం 15 నుండి 20 నిమిషాల్లో చేరుకునే వీలుండటంతో ఐటీ ఉద్యోగులు ఈ ప్రాంతాల వైపు క్యూ కడుతున్నారు. అలాగే ఈ ప్రాంతాల్లో ప్రముఖ అంతర్జాతీయ పాఠశాలలు, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ,షాపింగ్ మాల్స్ వేగంగా విస్తరిస్తుండటంతో నివాసయోగ్యత గణనీయంగా పెరిగింది.
రాబోయే రెండు మూడేళ్లలో ఇక్కడ ధరలు చదరపు అడుగుకు రూ. 8,000 మార్కును చేరుకుంటాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేవలం నివాసం కోసమే కాకుండా, భవిష్యత్తులో మంచి రాబడి వస్తుందనే ధీమాతో చిన్న ,మధ్యతరహా ఇన్వెస్టర్లు ఇక్కడ ప్లాట్లు, ఫ్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. పశ్చిమ హైదరాబాద్ విస్తరణలో బాచుపల్లి, కొల్లూరు కీలక భూమిక పోషిస్తాయనడంలో సందేహం లేదు.
