కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదిలాబాద్ రైతు గర్జన సభలో తెరాసపై చాలా తీవ్ర ఆరోపణలు చేశారు. నల్గొండ జిల్లాలో 99శాతం మంది తెరాస నేతలకి గ్యాంగ్ స్టార్ నయీంతో సంబంధాలున్నాయని ఆయన ఆరోపించారు. తెరాస నేతలు జిల్లాలో పోలీస్ స్టేషన్లను, తహసిల్దార్ కార్యాలయాలపై కర్రపెత్తనం చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. కనుక నయీం కేసులో తెరాస ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తుపై తనకి ఏమాత్రం నమ్మకం లేదని సిబిఐ విచారణ జరిపించాలని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఆయన మరో సంచలనమైన విషయం కూడా చెప్పారు. నయీం అనుచరులు తనని కూడా ఎన్నికలలో పోటీ చేయవద్దని బెదిరించారని చెప్పారు. కానీ తాను నయీం బెదిరింపులకి భయపడకుండా ఎన్నికలలో పోటీ చేశానని చెప్పారు.
నయీం తనని బెదిరించినప్పటికీ అతనికి తాను భయపడలేదని రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు గొప్పలు చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ మాట నయీం తనని బెదిరించినప్పుడో లేదా అతను బ్రతికున్నప్పుడో చెప్పి ఉంటే జనం నమ్మేవారేమో కానీ ఇప్పుడు ఎవరూ నమ్మకపోవచ్చు. తెరాస నేతలకి నయీంతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తున్న రాజగోపాల్ రెడ్డి, నయీంని పెంచి పోషించింది గత ప్రభుత్వాలేననే మీడియాలో వస్తున్న వార్తలని పట్టించుకొన్నట్లు లేదు.
ఆ వార్తలలో పెర్కొన్నబడినవారు ఒకరొకరుగా మీడియా ముందుకు వచ్చి నయీంతో తమకి ఎటువంటి సంబంధాలు లేవని సంజాయిషీలు ఇచ్చుకోవలసి వస్తోంది. ఆ సంగతి విస్మరించి, తెరాస నేతలపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంది.
నయీం ఎన్కౌంటర్ తరువాత తెలంగాణా రాజకీయాలలో హీరోలు, భాదితులు అనే రెండు రకాల మనుషులు కనిపిస్తున్నారు. నయీంతో సంబంధాలున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమా మాధవ రెడ్డి వంటివారు ఆ మరకలను తుడుచుకోవడానికి ప్రయత్నిస్తుంటే, రాజగోపాల్ రెడ్డి వంటి మరికొందరు నయీంని ఎదిరించిన హీరోలు పుట్టుకొస్తున్నారిప్పుడు.