కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపై మళ్లీ ఆశలు చిగురించాయి. తన పొలంలో మొలకలు వస్తున్నాయని ఆయనకు సిగ్నల్స్ రావడంతో ఇటీవల రేవంత్ రెడ్డిపై మాటల దాడిని ఆపేశారు.తాజాగా ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తనకు మంత్రి పదవి త్వరోల వస్తుందని చెప్పుకున్నారు. కోమటిరెడ్డి కొద్ది రోజులుగా సైలెంట్ గా లాబీయింగ్ చేసుకున్నారని తరచూ ఢిల్లీ పర్యటనలు, అధిష్టానంతో జరిపిన చర్చలు జరిపారని అందుకే ఇంత నమ్మకంగా చెబుతున్నారని అంటున్నారు.
ప్రజాసేవలో తాను ఎప్పుడూ ముందుంటానని, పార్టీ కోసం తాను చేసిన కృషిని అధిష్టానం గుర్తిస్తుందని రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారు. త్వరలోనే శుభవార్త వింటారని, మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు రాష్ట్ర అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ముందే ప్లాన్ వేసుకుంటున్నారు. ఇటీవల వచ్చిన స్పెక్యులేషన్స్ ప్రకారం ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని తప్పించి.. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగింది.
రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా సందడి నెలకొంది. మంత్రివర్గంలో మార్పు చేర్పులు ఉంటాయని ప్రచారం జరుగుతున్న సమయంలో రాజగోపాల్ రెడ్డి ఇంత బహిరంగంగా ప్రకటన చేయడం వెనుక అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ వచ్చి ఉంటుందని భావిస్తున్నారు.