కాంగ్రెస్ పార్టీలోనూ ఓ రాజాసింగ్ తయారయ్యారు. తనకు తాను బాహుబలిలా ఊహించుకుని.. పార్టీకి రాజీనామా చేసిన రాజాసింగ్.. ఇప్పుడు ఒక్క విజిల్ వేస్తే వచ్చేస్తానని సంకేతాలు పంపుతున్నారు. కానీ బీజేపీ హైకమాండ్ కు అంత తీరిక లేదు. ఇప్పుడు కాంగ్రెస్ లో రాజగోపాల్ రెడ్డి కూడా అంతే తయారయ్యారు. తన గురించి ఆయన ఎక్కడో ఊహించుకుంటున్నారు. మంత్రి పదవి ఇవ్వకపోతే ఊరుకునేది లేదని ఎంత దూరమైన వెళ్తానని చెప్పుకొస్తున్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి లేకుండా ఉండలేకపోతున్నారు. ఏ కోణంలో చూసినా మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేకపోయినా ఆయన మాత్రం తగ్గడం లేదు. రేవంత్ రెడ్డిపై తన అసంతృప్తిని బయటపెట్టిన ఆయన ఇప్పుడు నేరుగా పార్టీ కార్యకర్తలతో తన ఘోషను బయట పెట్టుకున్నారు. మంత్రి పదవి ఇస్తానంటేనే తాను పార్టీలోకి వచ్చానని భువనగిరి ఎంపీని గెలిపిస్తే పదవి ఇస్తామన్నారన్నారు. తాను ఎవరి కాళ్లు పట్టుకుని పదవి తెచ్చుకోనని చెప్పుకొచ్చారు.
రాజగోపాల్ రెడ్డి 2019లో గెలిచినప్పుడు పార్టీని ఏ నాడూ గౌరవించలేదు. బీజేపీలో చేరేందుకు చాలాసార్లు ప్రయత్నించారు. బీజేపీలో తానే ముఖ్యమంత్రి అభ్యర్థిని అని చెప్పుకోవడంతో.. పార్టీలో చేర్చుకోకుండా ఆపేశారు. అయితే ఎన్నికలకు ఏడాది ముందు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఫినిష్ చేయాలన్న బీజేపీ వ్యూహంలో భాగంగా ఆయన రాజీనామా చేసి ఉపఎన్నికలు తెచ్చారు. తర్వాత కాంగ్రెస్ గెలుస్తుందన్న అభిప్రాయం ఏర్పడటంతో మళ్లీ కాంగ్రెస్ లో చేరి గెలిచారు.
ఇలాంటి అవకాశవాదంతో వ్యవహరించే రాజగోపాల్ రెడ్డి.. మరో రాజాసింగ్ లా.. ఏ పార్టీకి కాకుండా పోయేలా ఉన్నారు. ఏ మాత్రం విశ్వసనీయత లేని రాజకీయాలు చేసే రాజగోపాల్ రెడ్డి రాజాసింగ్ ను చూసి అయినా నేర్చుకోవాలన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.