కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసి.. అనర్హతా వేటు వేయడానికి అవసరమైన అర్హత సాధించారు. మంత్రి పదవి రాదని తెలిసినప్పటి నుండి ఆయన తిరుగుబాటు చేస్తున్నారు. మొదట ముఖ్యమంత్రిని టార్గెట్ చేసినా ఇప్పుడు నేరుగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు. యువతకు రెండు లక్షలు ఇస్తామని చెప్పి తమ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. నేపాల్ తరహాలో తెలంగాణ ప్రభుత్వంపై తిరుగుబాటు చేద్దామని.. ఓ అన్నలా అండగా ఉంటానని యువతకు పిలుపునిచ్చారు.
తెలంగాణ లిబరేషన్ డే సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించిన తర్వాత రాజగోపాల్ రెడ్డి తన రాజకీయం తాను చేసుకున్నారు. మంత్రి పదవి రానప్పటి నుండి ఆయన తాను కాంగ్రెస్ పార్టీలో లేనట్లుగానే వ్యవహరిస్తున్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు తిరుగుబాటు గురించి చెబుతున్నారు. ఆయన తీరుతో కాంగ్రెస్ పార్టీలోనూ అసహనం వ్యక్తమవుతోంది.
ఆయన ఘోరంగా క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. పీసీసీ చీఫ్ కూడా తనకు .. కోమటిరెడ్డి మీద ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు. క్రమశిక్షణా కమిటీ సుమోటోగా తీసుకుని విచారణ చేయవచ్చని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఎలా చూసినా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కంట్రోల్ చేసుకోకపోతే ఆయన నేరుగా మనుషుల్ని తీసుకొచ్చి ధర్నాలు చేయించినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది.