తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ హాట్ టాపిక్‌గా మారారు. సోమవారం అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్లో రేవంత్ రెడ్డితో రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. సుమారు పది నిమిషాల పాటు సాగిన ఈ ఏకాంత సమావేశంలో ప్రధానంగా మంత్రి పదవి అంశమే చర్చకు వచ్చినట్లు సమాచారం. మంత్రి పదవి విషయంలో గతంలో తాను చాలా విమర్శలు చేసి ఉండటంతో అవి తనకు మైనస్ కాకుండా ఉండేలా రాజీ చేసుకునేందుకు రాజగోపాల్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
రాజగోపాల్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి మధ్య సంబంధాలు గతంలో అంత సాఫీగా ఏమీ లేవు. రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాజగోపాల్ రెడ్డి ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ, ఆయన పాల్గొన్న అధికారిక కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండేవారు. ఒక దశలో రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత ఆరోపణలు కూడా చేశారు. తర్వాత బీజేపీలో చేరారు. మళ్లీ కాంగ్రెస్ గెలిచే చాన్స్ ఉందని కాంగ్రెస్ లో చేరారు. ఆ తరవాత మంత్రి పదవి ఇవ్వలేదని మళ్లీ లొల్లి పెట్టుకున్నారు.
ప్రభుత్వాన్ని మార్చేస్తానని.. సీఎం అవుతాననే ప్రకటనలు కూడా చేశారు. ఆ ప్రయత్నాల్లోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రహస్యంగా సమావేశమయ్యారనే ప్రచారం కూడా జరిగింది. పార్టీ కోసం కష్టపడిన సీనియర్లను కాదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. పాలనా పరంగా కూడా ఆరోపణలు చేశారు. అయితే ఇటీవలి కాలంలో ఆయన సైలెంట్ అయ్యారు. బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందన్న ప్రచారంతో రాజగోపాల్ రెడ్డి తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు రేవంత్ రెడ్డితో సయోధ్యకు ప్రయత్నిస్తున్నారు. సత్సంబంధాల ద్వారా తన లక్ష్యాన్ని సాధించుకోవాలని రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారు.
