వరంగల్ కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన అంతర్గత సంక్షోభంలో కొండా దంపతులు ఏ మాత్రం తగ్గాలని అనుకోవడం లేదు. కొండా దంపతులు కావాలా.. తాము కావాలో తేల్చుకోవాలని ఇతర నేతలు అల్టిమేటం జారీ చేయడంతో చివరికి మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగారు. వారిద్దరిని పిలిచి మాట్లాడారు. వివరణ తీసుకున్నారు.
కొండా దంపతులు కూడా పదహారు పేజీల్లో వరంగల్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నేతలపై, వారు చేస్తున్న వ్యవహారాలపై నివేదిక ఇచ్చారు.
తర్వాత మీడియాతో మాట్లాడి.. తాము తగ్గేది లేదన్న సంకేతాలు ఇచ్చారు. తాను బలహీవర్గాల ప్రతినిధినని ఎవరికీ భయపడబోనని కొండా మురళి స్పష్టం చేశారు. ఒకరిపై ఎప్పుడూ కామెంట్లు చేయమన్నారు. రేవంత్ రెడ్డి మరో పదేళ్లు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నానని.. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యమని కొండా మురళి విధేయత చూపారు. మంత్రికి సంబంధం లేకుండా ఆలయ కమిటీలు వేస్తున్నారు. మంత్రికి తెలియకుండా పోస్టింగ్ లు ఇస్తున్నారు. కడియం శ్రీహరి అక్రమ మైనింగ్ చేస్తున్నారని ఆరోపించారు. పని చేసే వాళ్లపై రాళ్లు వేస్తారు. మేం ప్రజలకోసం పని చేస్తున్నామన్నారు.
తన కుమార్తె రాజకీయాన్ని కొండా సురేఖ సమర్థించారు. ఎవరి రాజకీయాలు వాళ్లవని తన కుమార్తె పరకాల నుంచి రాజకీయాలు చేయాలనుకుంటున్నారని.. అందులో తప్పేముందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ను బతికించడమే కొండా మురళి ఉద్దేశం. రాహుల్ ను ప్రధాని చేయడం, రేవంత్ అన్నను పదేళ్లు సీఎంగా ఉండటం నా ఉద్దేశం. లోకల్ బాడీ ఎన్నికల్లో వరంగల్ జిల్లాలో అన్ని కాంగ్రెస్ గెలిచేలా పని చేస్తామన్నారు. కొండా మురళికి ఎమ్మెల్సీ కి అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను గెలిపించే బాధ్యత తీసుకుంటామన్నారు.
మీనాక్షి నటరాజన్ దగ్గర కూడా వారు ఏ మాత్రం తగ్గలేదు. ఇతర నేతలపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. దీంతో ఇతర నేతలు, కాంగ్రెస్ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.