హీరో – హీరోయిన్ ల మధ్య కెమిస్ట్రీ కుదిరితే ఆ సినిమా సూపర్ హిట్.
దర్శకుడికీ, హీరోకీ ట్యూన్ సెట్ అయితే ఆ కాంబో బంపర్ హిట్.
ఇదే కెమిస్ట్రీ ఇద్దరు హాస్య నటుల మధ్య కుదిరితే… వాళ్లే కోట శ్రీనివాసరావు – బాబూ మోహన్.
వీరిద్దరూ చేసిన సినిమాలు ఒకటా, రెండా? దాదాపు 70 సినిమాల్లో జాయింటుగా కనిపించారు. నవ్వించారు.
మామగారు, చిన రాయుడు, స్నేహం కోసం, బొబ్బిలి రాజా, హలో బ్రదర్, పెదరాయుడు, మాయలోడు, జంబలకిడి పంబ… ఇలా ఎన్నో… ఎన్నెన్నో.
మామగారులో బాబూ మోహన్ – కోట కాంబో అల్టిమేట్. బాబూ మోహన్ వంగోవడం, కోట తన్నడం.. ఈ సీన్ ఎన్నిసార్లు రిపీట్ అయ్యిందో… ప్రతీసారీ నవ్వులు. ఆ డోసు ఒక్కసారి కూడా తగ్గలేదు.
ఆ సినిమా ఎంత క్రేజ్ తీసుకొచ్చిందంటే – ప్రతీ సినిమాలోనూ బాబూ మోహన్ తో పాటు కోట, కోటతో పాటు బాబూ మోహన్ ఉండాల్సిందే అని హీరోలు పట్టుపట్టేవారు. మూడు షిఫ్టుల్లో పని చేసిన సందర్భాలూ, 24 గంటలూ సెట్ లోనే ఉన్న వైనాలూ వీరిద్దరి కెరీర్లో ఎన్నెన్నో. కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా, అన్నదమ్ముల కంటే మిన్నగా ఇద్దరూ కలిసి ప్రయాణం చేశారు.
బాబూ మోహన్ – కోట కెమెరా ముందు ఉంటే వాళ్లిద్దరికీ సెపరేట్ గా స్క్రిప్టే అవసరం ఉండేది కాదు.
‘నువ్వీ డైలాగ్ చెప్పు.. నేను ఇలా అంటా’ అంటూ ఇద్దరూ మాట్లాడేసుకొని రెడీ అయిపోయేవాళ్లు. ఆ పంచ్‌లే పండేవి. థియేటర్లో చప్పట్లు కొట్టించేవి.
కెమెరా ముందే కాదు.. బయటా అంతా. ‘ఏంట్రా..’ అంటే ‘ఏంట్రా’ అనుకొనేంత చనువు. ఒక్కరోజు కలవకపోతే చాలు.. ఫోన్లు చేసుకొని ‘బోర్ కొడుతుంద్రా.. ఓసారి ఇంటికి రా` అనుకొనేంత ఆప్యాయత. అవుడ్డోర్కి వెళ్తే ఇద్దరికీ పక్క పక్క రూములు ఇవ్వాల్సిందే. ‘రెండు రూములు తీసినా, ఇద్దరూ ఉండేది ఒక్క రూములోనే కదా. మళ్లీ మాకు ఓ రూమ్ డబ్బులు దండగ’ అని నిర్మాతలు తిట్టుకొంటూనే నవ్వుకొనేవాళ్లు. అంతటి బంధం వాళ్లది.
వీళ్ల వ్యక్తిగత జీవితాల్నీ దేవుడు ఒకేలా రాశాడేమో అనిపిస్తుంది. కోట కుమారుడు కోట ప్రసాద్ ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బాబూ మోహన్ కీ పుత్ర శోకం తప్పలేదు. కొడుకు పవన్ కుమార్ కూడా రోడ్డు ప్రమాదంలో మరణించి మరణించారు. అలా.. ఈ ఇద్దరు నటులూ పుత్ర శోకాన్ని అనుభవించాల్సివచ్చింది.
కోట మరణం కోట్లాదిమందిని బాధించింది. కన్నీటి పర్యంతంలో ముంచింది. అందరిదీ ఒక శోకం.. బాబూ మోహన్‌ది మరో శోకం. ఓ అన్నని కోల్పోయినంత బాధ. ‘కోటన్న లేడు’ అంటూ కన్నీరు మున్నీరవుతుంటే బాబూ మోహన్ ని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు.