kothapallilo okappudu Movie review
తెలుగు360 రేటింగ్: 2.25/5
చిన్న సినిమాల్ని తేలిగ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అవి అప్పుడప్పుడూ అద్భుతాల్ని సృష్టిస్తుంటాయి. బాక్సాఫీసు పరంగా వందల కోట్లు తీసుకురాకపోయినా… తీసిన వాళ్లకు సంతృప్తి, గౌరవం దక్కేలా చేస్తాయి. ఒక్కోసారి డబ్బులు, అవార్డులూ రెండూ వస్తాయి. ‘కేరాఫ్ కంచరపాలెం’ అలాంటి సినిమానే. కొత్త తరహా ప్రయత్నాలకు బూస్టప్ ఇచ్చిన సినిమాల్లో అదొకటి. హీరో రానా కూడా అప్పుడప్పుడూ నిర్మాతగా, సమర్పకుడిగా కొన్ని మంచి ప్రయత్నాలకు తన వంతు సహకారం అందిస్తుంటాడు. ‘కేరాఫ్ కంచరపాలెం’ విజయంలో కూడా తనకు వాటా వుంది. ఇప్పుడు ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ అనే సినిమాకు సైతం తానే సమర్పకుడిగా వ్యవహరించాడు. `కంచరపాలెం` చిత్రాన్ని నిర్మించిన ప్రవీణ పరుచూరి ఈ చిత్రంతో దర్శకురాలిగా మారారు. ఇవన్నీ బేరీజు వేసుకొంటే ‘కొత్తపల్లి..’పై కచ్చితంగా నమ్మకం ఏర్పడుతుంది. అలా అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ చిత్రం ఎలా వుంది? రానా నమ్మకం మరోసారి నిజమైందా? కొత్త దర్శకురాలి పని తీరు ఎలా వుంది?
కొత్తపల్లి గ్రామం చుట్టూ తిరిగే కథ ఇది. అక్కడ అప్పన్న (రవీంద్ర విజయ్) ఊరందరికీ అప్పులు ఇస్తుంటాడు. వడ్డీ వసూలు చేసే దగ్గర చాలా కర్కశంగా వ్యవహరిస్తుంటాడు. అప్పన్న సహాయకుడు రామకృష్ణ (మనోజ్ చంద్ర). తనకు ఓ రికార్డింగ్ డాన్స్ ట్రూప్ కూడా ఉంటుంది. ఆ ట్రూప్కి ఓ లేడీ డాన్సర్ అవసరం. ప్రెసిడెంటు రెడ్డి (బెనర్జీ) కూతురు సావిత్రి (మౌనిక) అంటే రామకృష్ణకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచీ మూగగా ఆరాధిస్తుంటాడు. సావిత్రిని ట్రూప్‌లో పెట్టుకొంటే బాగుంటుందని రామకృష్ణకు ట్రూప్‌లోని సహచరులు సలహా ఇస్తారు. కానీ సావిత్రిని ఒప్పించడం ఎలా? అందుకే సావిత్రి స్నేహితురాలు ఆదిలక్ష్మి (ఉషా బోనెల) సహాయం కోరతాడు రామకృష్ణ. అటు రామకృష్ణకీ, ఇటు సావిత్రికీ మధ్యవర్తిత్వం వహించడానికి ఆదిలక్ష్మి కూడా ఒప్పుకొంటుంది. కాకపోతే.. చీకట్లో గడ్డివాము దగ్గర ఆదిలక్ష్మి, రామకృష్ణలను జంటగా చూసిన జనం.. అపార్థం చేసుకొంటారు. దాంతో ఈ కథ అడ్డం తిరుగుతుంది. ఆ తరవాత ఏం జరిగింది? సావిత్రి రామకృష్ణ ట్రూప్‌లో చేరిందా? వారిద్దరూ కలుసుకొన్నారా? అప్పన్న వడ్డీల భారం నుంచి ఆ ఊరికి ఎలాంటి విముక్తి దొరికింది? ఈ వ్యవహారాలు ఆ ఊరిలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాయి? అనేది మిగిలిన కథ.
పల్లెటూళ్ల వ్యవహారాలు, అక్కడి ప్రేమకథలు, రాజకీయాలు, నమ్మకాలు.. వీటి చుట్టూ తిరిగే కథలు ఎన్నిసార్లు చూసినా, ఎన్నిసార్లు విన్నా బాగానే ఉంటాయి. ఎందుకంటే ఆ మట్టివాసన, మలినం లేని మనుషుల కథ మనసుల్ని పట్టేస్తాయి. `కొత్తపల్లిలో` కథ కూడా అలానే మొదలెట్టారు. ఊరి మనుషులు, వాళ్ల మనస్తత్వాలు, ఇబ్బందులు, పెద్దరికాలూ చూపిస్తూ కథలోకి తీసుకెళ్లారు. బెనర్జీ, రవీంద్ర విజయ్ క్యారెక్టర్ల మధ్య కాన్ఫ్లిక్ట్ ఏమిటన్నది తొలి సన్నివేశాల్లోనే చూపించేశారు. ద్వితీయార్థంలో అది కథకు కీలకంగా మారింది. రామకృష్ణ – సావిత్రిల లవ్ స్టోరీ ఇంట్రస్టింగ్ గా రాసుకొన్నారు. అలాగని వాళ్లిద్దరి మధ్యా ప్రేమంటూ ఏం ఉండదు. మధ్యవర్తిత్వం వహించే ఆదిలక్ష్మి నేపథ్యంలో వచ్చిన సన్నివేశాలు, పాట.. అలరిస్తాయి. గడ్డివాము దగ్గర ఆదిలక్ష్మి, రామకృష్ణ దొరికిపోవడం, వాళ్లని ఊర్లోవాళ్లు అపార్థం చేసుకోవడంతో కథ ముదిరి పాకాన పడుతుంది. రామకృష్ణ ప్రేమించింది సావిత్రిని.. కానీ మధ్యవర్తిత్వం వహించిన ఆదిలక్ష్మిని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. దానికి కారణమైన సన్నివేశాల్ని చాలా సహజంగా తెరకెక్కించారు. రామకృష్ణ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయినప్పుడు ఇంట్రవెల్ బ్యాంగ్ వేశారు.
తొలిసగంలో పెద్దగా కంప్లైంట్స్ ఏం ఉండవు. టైమ్ పాస్‌కి ఢోకా లేకుండా చూసుకొన్నారు. ద్వితీయార్థంలో హీరో ఎలా బయటపడతాడు? అనేదానిపై ఫోకస్ పెరుగుతుంది. అయితే అందుకోసం ఎంచుకొన్న డ్రామా మాత్రం వాస్తవికతకు దూరంగా ఉంది. అప్పన్నని దేవుడ్ని చేయడం, ఊరి ప్రజలు ఏకంగా అప్పన్నకు గుడి కట్టేయడం ఇవన్నీ సహజంగా కుదర్లేదు. అప్పటి వరకూ అప్పన్నని జనం చీదరించుకొంటారు. అప్పన్న చనిపోతే తమ పీడ విరగడ అయ్యిందనుకొంటారు. అలాంటప్పుడు చనిపోగానే దేవుడని నమ్మి గుడి కట్టడం ఏమిటో అర్థం కాదు. ‘దేవుడంటే నిజమో,అబద్ధమో కాదు.. నమ్మకం’. ‘ఒకదాన్ని సృష్టించడమే కాదు. నాశనం చేయడం కూడా కష్టమే’ అనే రెండు బలమైన అంశాలు ఈ కథకు పునాది. ఇలాంటి విషయాల్ని స్క్రీన్‌కి చెప్పాలనుకోవడం మంచి ఆలోచన. బలమైన అంశాలు కూడా. కాకపోతే.. చెప్పిన విధానంలో సహజత్వం లేకుండా పోయింది. రామకృష్ణలో వచ్చే మార్పు, అందుకు దోహదం చేసిన కారణాలు బలంగా లేవు.
ఈ సినిమా కాస్టింగ్ చక్కగా కుదిరింది. రామకృష్ణ పాత్రలో మనోజ్ చంద్ర ఒదిగిపోయాడు. తన కటౌట్ బాగుంది. క్లైమాక్స్ లో సెటిల్డ్ పెర్‌ఫార్మ్సెన్స్ చేశాడు. అప్పన్నగా రవీంద్ర విజయ్ పాత్ర కీలకం. ఈ పాత్ర సెకండాఫ్‌లో మాయం అయిపోయినా ఆ ఇంపాక్ట్ మాత్రం సినిమా మొత్తం ఉంటుంది. బెనర్జీకి చాలా కాలం తరవాత మంచి పాత్ర పడింది. తన అనుభవాన్ని చూపించారు. ఈ సినిమాలో హీరోయిన్ మౌనిక కావొచ్చు. కాకపోతే.. ఆదిలక్ష్మిగా నటించిన ఉషాకి ఎక్కువ మార్కులు పడతాయి. సీనియర్ నటులు బాబూ మోహన్ ఓ సన్నివేశంలో కనిపించారు. సత్యం రాజేష్ ఒక్క సీన్ చేసినా నవ్వించగలిగాడు.
కెమెరాపనితం బాగుంది. ఊరి అందాల్ని చాలా సహజంగా ఒడిసిపట్టారు. మణిశర్మ పాటలు కూడా వినసొంపుగా ఉన్నాయి. ముఖ్యంగా కథానాయిక అందాల్ని రాశులతో పోలుస్తూ పాడిన పాట బాగుంది. దర్శకురాలిగా ప్రవీణకు ఇది తొలి సినిమా. చెప్పాలనుకొన్న విషయాన్ని చాలా నిజాయితీగా తెరపై ఆవిష్కరించిచడానికి తన వంతు కష్టపడ్డారు. ద్వితీయార్థంలో దేవుడు – నమ్మకాలు అని తిరక్కుండా, ఆ ఊరి వ్యవహారాలు, రామకృష్ణ ప్రేమకథపై ఫోకస్ చేసి ఉంటే కచ్చితంగా మరో ‘కంచరపాలెం’గా మిగిలిపోయేది. టేకాఫ్ బాగున్నా, ముగింపు సరిగా అతకని కారణంగా అనుకొన్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది ఈ చిత్రం.