సినిమాలకు ప్రమోషన్లు చాలా అవసరం. ఈ రోజుల్లో అయితే అత్యవసరం అని కూడా అనాలి. హీరో, హీరోయిన్లు సినిమాని ఎంత మోస్తే అంత మంచిది. `ఘాటీ` సినిమా విషయంలో మాత్రం అందుకు రివర్స్ లో జరుగుతోంది. అనుష్క నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమా ఇది. ఓ రకంగా ప్రచార బాధ్యత ఆమెదే. కానీ `ఘాటీ` ప్రమోషన్లలో ఆమె కనిపించడం లేదు. ‘ప్రచారానికి రానని స్వీటీ ముందే చెప్పేసింది. దానికి మేం ఒప్పుకొనే ఆమెతో ఈ సినిమా చేశాం’ అని క్రిష్, నిర్మాత రాజీవ్ రెడ్డి చెబుతున్నారు. నిజానికి అనుష్క ఈ సినిమా ప్రమోషన్లకు రాకపోవడం ఓ పెద్ద మైనస్. కానీ.. దాన్ని దర్శక నిర్మాతలు బాగా కవర్ చేశారు. అనుష్కపై నిందలేం వేయకుండా.. ఆమెను వెనకేసుకొని వచ్చారు. ‘ఆమె నిర్ణయాన్ని మేం గౌరవించాలి’ అంటూ తమ మద్దతు తెలిపారు.
క్రిష్ అయితే ఓ అడుగు ముందుకేసి.. ‘మాకు స్వీటీ పెర్ఫార్మెన్స్ చాలు.. ప్రమోషన్ అవసరం లేదు’ అనేశారు. ఈ సినిమాపై క్రిష్ గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇటీవల ఫైనల్ కాపీ చూసుకొన్న తరవాత క్రిష్ నమ్మకం మరింత రెట్టింపు అయ్యింది. ఓసారి ప్రేక్షకులు థియేటర్లకు వస్తే… అక్కడ్నుంచి అనుష్క నటన, ఈ సినిమాలో ఉన్న కంటెంట్.. జనాల్ని థియేటర్లకు రప్పిస్తుందన్నది ఆయన భరోసా.
అనుష్క విషయంలోనే కాదు. ‘హరి హర వీరమల్లు’ టాపిక్ వచ్చినప్పుడు కూడా క్రిష్ చాలా తెలివిగా స్పందించారు. ‘నొప్పించక తానొవ్వక’ అన్నట్టు స్టేట్మెంట్ విసిరారు. తాను ప్రతీ సినిమాకూ ఒకేలా కష్టపడతానని, అనుకోని పరిస్థితుల్లో వీరమల్లు నుంచి బయటకు రావాల్సివచ్చిందని, వచ్చాక తన దృష్టంతా ‘ఘాటీ’పైనే ఉందని చెప్పుకొచ్చారు క్రిష్. సాధారణంగా ఓ స్టేట్మెంట్ వస్తే… మీడియాలో ఓ వర్గం దాన్ని చిలవలు పలవలుగా వక్రీకరించి కొత్త కోణాలు వెదికి నానా రభస చేస్తుంటుంది. ఈ విషయం క్రిష్‌కి కూడా తెలుసు. అందుకే ఎలాంటి వక్రీకరణలకూ తావివ్వకుండా.. సమాధానాలు చెప్పుకొంటూ వచ్చారు.