‘ఎన్టీఆర్’ బయోపిక్ కి దర్శకుడు ఎవరు? అనే విషయంపై చాలా కాలం చర్చ సాగింది. ఓ దశలో బాలకృష్ణనే ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తాడని చెప్పుకున్నారు. రాఘవేంద్రరావు పేరు కూడా బయటకు వచ్చింది. ఆ తరవాత తేజ వచ్చాడు. ఈ సినిమాని ఘనంగా ఆరంభించి.. అంతలోనే వదిలేసి వెళ్లిపోయాడు. అప్పుడు మళ్లీ…. చర్చలు మొదలైపోయాయి. ఇలాంటి సినిమా తెరకెక్కించడంలో క్రిష్ సమర్థుడన్న సంగతి తెలిసినప్పటికీ… క్రిష్ని సంప్రదించే పరిస్థితి లేదు. ఎందుకంటే.. అప్పట్లో క్రిష్ మణికర్ణిక సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ దశలో ఎన్టీఆర్ బయోపిక్ ని తన నెత్తిమీద వేసుకోలేడని.. చాలా మంది భావించారు. అయితే అనూహ్యంగా క్రిష్ రేసులోకి రావడం, బయోపిక్ బాధ్యత తీసుకోవడం, దాన్ని పూర్తి చేయడం జరిగిపోయాయి.
క్రిష్ని రంగంలోకి దింపడానికి బాలయ్య చాలా రకాలుగా ప్రయత్నించాడని, బాలయ్య అడిగాడనే క్రిష్ ఈ ప్రాజెక్టు టేకప్ చేశాడని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే…’నాకు ఈ సినిమా కావాలి’ అని క్రిష్ తనంతట తానే బాలయ్య దగ్గరకు వచ్చి అడిగాడట. క్రిష్ అడిగేసరికి బాలయ్య కూడా ‘సరే… ప్రొసీడ్’ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ విషయాన్ని బాలయ్య సన్నిహితులు కూడా ధృవీకరిస్తున్నారు. రాఘవేంద్రరావు లాంటి మహామములు… ‘ఈ సినిమా చేయలేం’ అంటూ చేతులు ఎత్తేస్తే… క్రిష్ అంత ధైర్యం ఎలా చేశాడో మరి! ఒకవేళ క్రిష్ తానంతట తాను ముందుకు రాకపోతే… ఆ అవకాశం ఎవరికి దక్కేదో…???